Asianet News TeluguAsianet News Telugu

PM Modi: కార్మికులతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్..

తన సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) .. రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ కారిడార్ (Kashi Vishwanath Dham corridor) తొలి దశను ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కారిడార్ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన కార్మికులతో కలిసి భోజనం చేశారు.

PM Modi had lunch with workers who built the Kashi Vishwanath Corridor
Author
Varanasi, First Published Dec 13, 2021, 4:29 PM IST

తన సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) .. రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ కారిడార్ (Kashi Vishwanath Dham corridor) తొలి దశను ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఇందుకోసం సోమవారం ఉదయం వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ప్రజలు కూడా పూల వర్షం కురిపిస్తూ మోదీకి ఘన స్వాగతం చెప్పారు. మోదీ మోదీ, హర్​ హర్​ మహాదేవ్​ అంటూ నినాదాలు చేశారు. తొలుత ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గంగానదిలో డబుల్‌ డెక్కర్‌ షిప్‌పై ప్రయాణించారు. తర్వాత ఉత్తరప్రదేశ్‌ CM యోగి ఆదిత్యానాథ్ దాస్‌తో కలిసి మోదీ.. డబుల్ డెక్కర్ బోట్‌లో ఖిర్కియా ఘాట్ నుండి లలితా ఘాట్ వరకు ప్రయాణించారు. అనంతం గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో కూడా ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ తొలి దశను మోదీ ప్రారంభించారు. తర్వాత మోదీ ఈ కారిడార్ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన కార్మికులతో కలిసి భోజనం చేశారు. ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. నిర్మాణ కార్మికులతో పాటు కలిసి కూర్చొని భోజనం చేశారు. కొద్దిసేపు అక్కడ ఉన్న కార్మికులతో ముచ్చటించారు. వారికి అభివాదం చేశారు. 

 

ఇక, ఈ కారిడార్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ.. అద్భుత నిర్మాణం కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ సమయంలో కూడా ఇక్కడ పనులు నిలిచిపోలేదని అన్నారు. ఇందుకోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్టుగా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం శ్రమించిన యూపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను మోదీ అభినందించారు. 

Also read: కాశీలో శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.. దేశాభివృద్ధికి కాశీ సహకారం అంతులేనిది: ప్రధాని నరేంద్ర మోదీ

‘కాశీలో ప్రవేశించిన వెంటనే సర్వ బంధాల నుండి విముక్తి పొందుతారని మన పురాణాలలో చెప్పబడింది. భగవంతుడు విశ్వనాథుని ఆశీస్సులు, ఒక అతీంద్రియ శక్తి ఇక్కడికి రాగానే మన అంతరంగాన్ని మేల్కొల్పుతుంది. విశ్వనాథ్ ధామ్ యొక్క ఈ సరికొత్త సముదాయం కేవలం ఒక గొప్ప భవనం మాత్రమే కాదు. ఇది మన భారతదేశ సనాతన సంస్కృతికి ప్రతీక.. ఇది మన ఆధ్యాత్మిక ఆత్మకు చిహ్నం.. ఇది భారతదేశ ప్రాచీనతకు, సంప్రదాయాలకు ప్రతీక.

గతంలో మూడు వేల చదరపు అడుగులు మాత్రమే ఉన్న ఆలయ విస్తీర్ణం ఇప్పుడు దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోకి మార్చాం. ఇకపై ఆలయానికి, ఆలయ ప్రాంగణానికి 50 నుంచి 75 వేల మంది భక్తులు రావచ్చు. ముందుగా గంగామాత దర్శనం-స్నానం ఆచరించి.. అక్కడి నుంచి నేరుగా విశ్వనాథ్ ధామానికి చేరుకోవచ్చు’ అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 3,000కు పైగా ఆధ్యాత్మిక, మత గురువులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

 

పారిశుద్ధ్య కార్మికుల‌పై పూల వ‌ర్షం కురిపించిన మోదీ..
అంతకు ముందు ప్రధాని మోదీ.. కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో పారిశుద్ధ్య కార్మికుల‌పై పూల వ‌ర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణంలో పలు వరుసల్లో కూర్చొన్న కార్మికులపై పూలు చల్లారు. ప్రతి ఒక్కరిపై పూలు పడేలా అన్ని వైపుల కలియతిరిగారు. అనంతరం వారితో కలిసి మోదీ ఫొటో దిగారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios