టర్కీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగం.. కళ్లలో నీళ్లు..!
ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. టర్కీ, సిరియాలలో వణికించిన భూకంపాల వల్ల వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి మాట్లాడుతుండగా నరేంద్ర మోదీ కళ్లలో నీళ్లు తిరిగాయి.

ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. టర్కీ, సిరియాలలో వణికించిన భూకంపాల వల్ల వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి మాట్లాడుతుండగా నరేంద్ర మోదీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈరోజు ఉదయం జరిగిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ప్రధాని భావోద్వేగానికి లోనైనట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. టర్కీ, సిరియాలలో భూకంపం విషాదం సృష్టించిన వేళ.. గుజరాత్‌లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న 2001 భుజ్ భూకంపాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో సంభవించిన విధ్వంసకర భుజ్ భూకంపాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ సహాయక చర్యలకు ఎదురైన సవాళ్ల గురించి ఈ సమావేశంలో మాట్లాడారు. భూకంపంతో దెబ్బతిన్న ప్రాంతాలకు భారత ప్రభుత్వం అందిస్తున్న మానవతా సహాయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. టర్కీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎలాంటిదో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇక, టర్కీ, సిరియాలలో చోటుచేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సహాయాన్ని పంపిస్తున్నాయి. విపత్తు కారణంగా దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న టర్కీకి సాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ కలిసి తొలి బ్యాచ్ సహాయక సామగ్రితో టర్కీకి బయలుదేరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
భూకంపంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన ట్వీట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు.