జర్మన్ చాన్సిలర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, నాగాల్యాండ్ శాలువాలను బహూకరించారు. ఈ రోజు ఢిల్లీలో జర్మన్ చాన్సిలర్ ఓలాఫ్ షోల్జ్‌ను కలిసి వీటిని అందించారు. ఈ శాలువాలకు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్నది. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేఘాలయా, నాగాల్యాండ్ శాలువాలను జర్మన్ చాన్సిలర్‌ ఓలాఫ్ షోల్జ్‌కు శనివారం బహూకరించారు. ఓలాఫ్ షోల్జ్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోడీ కలుసుకన్నారు. మేఘాలయా, నాగాల్యాండ్ రాష్ట్రాల్లో ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రెండు వస్తువులు ఆ రాష్ట్రాల్లోని తెగల సంస్కృతికి ప్రతిబింబాలని అధికారవర్గాలు వివరించాయి. ఆ తెగల కల్చర్, వారి నైపుణ్యాలను వెల్లడించే వస్తువులని తెలిపాయి. మేఘాలయా, నాగాల్యాండ్ రెండూ ఈశాన్య రాష్ట్రాలే.

మేఘాలయా శాలువాకు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్నది. వీటిని నేయడం తరాలుగా కొనసాగుతూనే ఉన్నది. రాజవంశీకులు ఈ శాలువాలను వినియోగించుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ముఖ్యంగా ఈ శాలువాలను ఖాసి, జైంతియా రాజవంశస్తుల కోసం నేసేవారు. వారు ఈ శాలువాల్లో తమ హోదా, అధికారాన్ని చూసుకునేవారు. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో వీటిని అధికారిక గుర్తుగా ధరించేవారు. ఇవి రాచకుటుంబాల సంపద, కీర్తిని వెల్లడించేవిగా భావించేవారు. ఈ శాలువాలను స్థానిక రంగులు, నూలుతో స్థానికులే నేసేవారు. 

ఈ శాలువాలపై నేసే గుర్తులకూ ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని ఎంతో నైపుణ్యంతో స్థానిక తెగలు నేస్తాయి. వీటికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. వస్త్రాలపై ఆసక్తి ఉన్నవారు ఈ శాలువాలను సేకరిస్తూ ఉంటారు.

Also Read: భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం - జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్

అలాగే, నాగాల్యాండ్ శాలువాల చరిత్ర కూడా శతాబ్దాల పురాతనమైనది. ఈ శాలువాలను నాగాల్యాండ్‌లోని ప్రత్యేకమైన తెగలే నేస్తాయి. వీటిని ఇక్కడి తెగలు కొన్ని వందల సంవత్సరాలుగా ధరిస్తున్నారు. ఉజ్వలమైన రంగులు, భిన్నమైన డిజైన్లతో ఉండే వీటిని ధరించడం అక్కడి తెగల సాంప్రదాయంగా ఉన్నది. వీటి నేత తరాలుగా కొనసాగుతూ వస్తున్నది. 

ఈ శాలువాలపై డిజైన్లు ఆ తెగల కాల్పనికలు, యోధులు, విశ్వాసాల ఆధారంగా రూపొందిస్తారు. నాగాల విలువైన సాంస్కృతిక వారసత్వానికి ఇవి నిదర్శనంగా ఉన్నాయి. ఇవి వారి చరిత్రకు, విశ్వాసాలకు, వారి జీవన విధానాలకు చిహ్నాలుగా ఉన్నాయి. వీరు శాలువాలు కేవలం వస్త్రాలే అనుకోరు. ఈ వస్తువుల్లో ఆత్మ ఉంటుందనీ భావిస్తారు.