ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అసాధారణమైన ఘనత సాధించినట్టుగా పేర్కొన్నారు. నాటు నాటు సాంగ్‌కు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉందని తెలిపారు.
నాటు నాటు సాంగ్ ఏళ్ల తరబడి గుర్తుండిపోయే పాట అని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకన్నందుకు కీరవాణి, చంద్రబోస్‌లతో మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు. భారతదేశం గర్వపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ కూడా ఆస్కార్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈ డాక్యూమెంటరీ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోన్గాతో పాటు మొత్తం బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వారి పని సుస్థిర అభివృద్ది, ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి సంబంధించిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇక, నాటు నాటు సాంగ్ మొదట లిరికల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. జపాన్, చైనా, అమెరికా , ఇంగ్లాండ్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఫిదా అవుతూ ఈ పాటకి మ్యూజిక్ రీల్స్ చేశారు. ఈ పాట ఆస్కార్ అవార్డు సాధించింది అంటే రాజమౌళి, కీరవాణి తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, లిరిక్స్ అందించిన చంద్రబోస్, గాత్రం అందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గురించి కూడా చెప్పాలి.
ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అందించిన హుక్ స్టెప్ ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడానికి కారణం అని చెప్పాలి. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇద్దరూ తమ డ్యాన్స్ మూమెంట్స్ లో చిన్న తేడా కూడా లేకుండా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేశారు. ఆర్ఆర్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయంగా వస్తున్న రెస్పాన్స్ గమనించిన జక్కన్న రాజమౌళి.. ఈ చిత్రానికి ఆస్కార్ సాధించే సత్తా ఉందని గట్టిగా నమ్మారు. ఇండియా తరఫున ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ కాలేదు. అయినా రాజమౌళి నిరాశ పడలేదు. తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేశారు. ఫలితంగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక కావడం మాత్రమే కాదు.. అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను లైవ్‌లో పాడారు.
