ట్రంప్ గెలుపుతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం : అభినందనలు చెబుతూనే మోడీ ఆసక్తికర కామెంట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పదవిని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ కు మన హ్యాట్రిక్ పీఎం నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
US Election Results 2024 : అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఓడించి ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. ఇలా అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికన ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూనే భారత్-అమెరికా సంబంధాల గురించి మోదీ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం మంచి సంబంధాలు వున్నాయని... ట్రంప్ హయాంలో ఈ బంధం మరింత బలంగా మారుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్ కు సూచించారు భారత ప్రధాని.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు. మీరు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇండియా-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించాలని నేను ఎదురుచూస్తున్నాను. మన ప్రజల శ్రేయస్సు కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం" అంటూ మోదీ ట్వీట్ చేసారు.
అమెరికాతో సన్నిహిత దౌత్య, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడానికి, విస్తరించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని మోడీ సందేశం ప్రతిబింబిస్తుంది. ట్రంప్ మొదటి పదవీకాలంలో ఈ ఇద్దరు నాయకులు ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన సహకారాన్ని మెరుగుపరిచారు, గణనీయంగా సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నారు. ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడంతో, ప్రపంచ భద్రత, సాంకేతికత, ఆర్థిక పునరుద్ధరణ వంటి అంశాలపై సహకారాన్ని మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలకు అవకాశం లభించింది.
డొనాల్డ్ ట్రంప్ విజయ ప్రసంగం
ట్రంప్ ఫ్లోరిడా నుండి చేసిన విజయ ప్రసంగంలో "చరిత్రలో ఎన్నడూ లేని, శక్తివంతమైన తీర్పును ప్రజల ఇచ్చారు" అని అన్నారు. ఈ విజయంకోసం ప్రయత్నించే సమయంలో తనకు మద్దతుగా నిలిచివారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు, "ఇప్పుడు 47వ అధ్యక్షుడిగా, గతంలో45వ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని అన్నారు.
ఐక్యత కోసం కృషి చేస్తానని, బలమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన అమెరికాను అందిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. "ప్రతి క్షణం నేను మీ కోసం పోరాడుతాను, బలమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన అమెరికాను అందించే వరకు విశ్రాంతి తీసుకోను" అని నమ్మకంగా చెప్పారు.