Asianet News TeluguAsianet News Telugu

భారత నౌకదళంలోకి ఐఎన్‌ఎస్ విక్రాంత్.. దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహన నౌక విశేషాలు ఇవే..

భారతదేశం దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నేడు నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఈరోజు కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రధాని మోదీ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకదళంలో ప్రవేశపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ విశేషాలు మీ కోసం..
 

PM Modi commission First India made aircraft INS Vikrant here is the special features of warship
Author
First Published Sep 2, 2022, 10:57 AM IST

భారతదేశం దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నేడు నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఈరోజు కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రధాని మోదీ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకదళంలో ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఐఎన్‌ఎస్ వాహన నౌక ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్నారు. అలాగే కొచ్చిలో ప్రధాని మోదీ కొత్త నౌకాదళ సరికొత్త గుర్తును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఐఎస్‌ఎస్ విక్రాంత్ విశేషాలు ఇవే.. 
-భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను ‘‘కదిలే నగరం’’గా, బాహుబలి నౌకగా అభివర్ణిస్తున్నారు. 

-విక్రాంత్ నిర్మాణంతో దేశీయంగా విమాన వాహక నౌకను రూపొందించి, నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న యుఎస్, యుకె, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది.  

-ఐఎన్‌ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో ఉంది. 40 వేల టన్నుల  బరువు కలిగి ఉంటుంది. రష్యా ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య తర్వాత ఇది భారత దేశం యొక్క రెండవ విమాన వాహక నౌక. దీనినిర్మాణానికి రూ. 20 వేల కోట్లు ఖర్చు అయింది. 

-ఇది 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఏకధాటిగా  7వేల 500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. 

PM Modi commission First India made aircraft INS Vikrant here is the special features of warship

-భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థలు అలాగే 100కి పైగా ఎంఎస్‌ఎంఈలు అందించిన స్వదేశీ పరికరాలు, యంత్రాలను ఉపయోగించి ఈ యుద్ధనౌకను నిర్మించారు. విక్రాంత్‌ను ప్రారంభించడంతో.. భారత్ కార్యాచరణ విమాన వాహక నౌకలను కలిగి ఉంది. ఇది దేశం యొక్క సముద్ర మార్గ భద్రతను పెంచుతుంది.

- గతంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను బ్రిటన్‌ నుంచి భారత్ 1961లో కొనుగోలు చేసింది. ఇది 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. అయితే 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీకు కూడా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌గా నామకరణం చేశారు. 

-కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్‌ షిప్‌ డిజైన్‌ బ్యూరో ఈ నౌక డిజైన్‌ను రూపొందించింది., ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. 

- ఈ నౌక నిర్మాణాకికి అవసమైన స్టీల్‌ను డీఆర్‌డీఎల్, ఇండియన్ నేవీ సహకారంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా తయారుచేసింది. 

-ఈ నౌక సుమారు 2,200 కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంది. సుమారు 1,600 మంది సిబ్బంది కోసం రూపొందించబడింది. మహిళా అధికారులు, నావికులకు వసతి కల్పించడానికి ప్రత్యేక క్యాబిన్‌లను కలిగి ఉంది. 

-ఫిజియోథెరపీ క్లినిక్, ఐసియు, లేబొరేటరీలు, ఐసోలేషన్ వార్డుతో సహా సరికొత్త పరికరాలతో కూడిన పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ కూడా నౌకలో ఉంది.

-దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తో పాటు MiG-29K ఫైటర్ జెట్‌లు, Kamov-31, MH-60R మల్టీ-రోల్ హెలికాప్టర్‌లతో కూడిన 30 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ఎయిర్ వింగ్‌ను ఈ నౌక ఆపరేట్ చేయగలదు. 

- ఇందులో కిచెన్‌ కూడా అత్యాధునికమే. గంటకు ఏకంగా 3,000 చపాతీలు తయారు చేయగల యంత్రాలు ఇందులో ఉన్నాయి.

ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నిర్ధారించడంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ దోహదపడుతుందని భారత నావికాదళ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ ఎన్ ఘోర్మాడే ఇంతకు ముందు చెప్పారు. నవంబర్‌లో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని.. 2023 మధ్య నాటికి పూర్తవుతాయని తెలిపారు. మిగ్-29కె జెట్‌లు ఈ యుద్ధనౌక నుంచి మొదటి కొన్ని సంవత్సరాలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబన దిశగా విక్రాంత్‌ను ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios