ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నిర్విరామంగా ప్రతి రోజూ విధులు నిర్వహిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ఆర్టీఐకి సమాధానం ఇచ్చింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఖాళీగా ఉండరు. ఏదో ఒక పనిలో మునిగిపోతారు. నిద్ర కూడా మితంగానే పోతారు. ఇవన్నీ అధికారపార్టీ నేతలు, ఆయన అభిమానులు చెప్పేవిగా చూశాం. గుసగుసలు విన్నాం. కానీ, ఇప్పుడిదే అధికార సమాచారం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నరేంద్ర మోడీ ఒక్కటంటే.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేరని ఆర్టీఐ సమాధానం వెల్లడించింది.
ప్రఫుల్ పీ సర్దా అనే వ్యక్తి రెండు ప్రశ్నలతో ఆర్టీఐ దాఖలు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నరేంద్ర మోడీ ఎన్ని రోజుల ఆఫీసుకు వచ్చారు? అనేది మొదటి ప్రశ్న.‘ప్రధానమంత్రి ప్రతి రోజు డ్యూటీలోనే ఉన్నారు. ఒక్క సెలవు కూడా ప్రధాని మోడీ తీసుకోలేదు’ అని ఆర్టీఐకి సమాధానంగా వచ్చింది.
రెండో ప్రశ్న ఏమిటంటే.. ప్రధాని మోడీ విధులకు హాజరైన వివరాలు.. వివిధ కార్యక్రమాలు, ఫంక్షన్లకు హాజరైన సమాచారాన్ని అందించండి? ప్రధాని అన్ని రోజులు డ్యూటీలోనే ఉన్నారని, సుమారు మూడు వేలకు(దాదాపుగా రోజుకు ఒక ఈవెంట్)పైగా ఈవెంట్లకు ఆయన హాజరయ్యారని సమాధానం వచ్చింది.
ఆర్టీఐ సమాధానం పీఎంవో ఇచ్చింది. సెక్రెటరీ పర్వేశ్ కుమార్ అధికారంలో పీఎంవో ఈ సమాధానం ఇచ్చింది. పర్వేశ్ కుమార్ ఈ మినిస్ట్రీకి సంబంధించిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కూడా. ఈ శాఖ గురించి ఆర్టీఐ సమాధానాలకు ఈయనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: యూపీ సీఎం యోగి తమ్ముడు శైలేంద్ర మోహన్‌కు సుబేదార్ మేజర్‌గా ప్రమోషన్
గతేడాది మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ.. ఆయన కేవలం రెండే గంటలు నిద్రపోతారని చెప్పారు.
2016లోనూ ఇలాంటి ఆర్టీఐ దరఖాస్తే వచ్చింది. అప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి రోజూ విధుల్లోనే ఉన్నారనే సమాధానం వచ్చింది. ప్రధానమంత్రికి సెలవుల నిబంధనలు, ప్రొసీజర్ గురించిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఆర్టీఐ దాఖలైంది. అంతేకాదు, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజ్‌పేయి, హెచ్ డీ దేవేగౌడా, ఐకే గుజ్రాల్, పీవీ నర్సింహ రావు, చంద్రశేఖర్, వీపీ సింగ్, రాజీవ్ గాంధీలు ఎన్ని సెలవులు తీసుకున్నారని కోరారు. దీనికి సమాధానంగా.. ప్రధానమంత్రుల సెలవుల రికార్డులు తమకు అందుబాటులో ఉండవని పీఎంవో చెప్పింది. మాజీ ప్రధాన మంత్రుల సెలవులు వివరాలు తెలియవని, కానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని వివరించింది. ప్రతి రోజూ ఆన్ డ్యూటీలోనే ఉన్నారని వెల్లడించింది.
