ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ వేదికగా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ వేదికగా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు తనదైన శైలిలో సెటైర్లు కూడా వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చుకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ప్రసంగించిన మోదీ.. రెండు సందర్భాల్లో కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమం గురించే ప్రధాని ఎక్కువ సేపు మాట్లాడారు. అయితే ఉభయసభలలో వేర్వేరుగా ప్రధాని మోదీ ప్రసంగం చేయగా.. రెండు చోట్ల కూడా విపక్ష పార్టీ సభ్యులు నిరసనలు తెలిపారు. మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని మోదీ అవేమీ పట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెప్పేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. అయితే లోక్‌సభలో, రాజ్యసభలో ప్రసంగాల సందర్భంగా ప్రతిపక్షాలపై మోదీ చేసిన కీలక కామెంట్స్‌ను పరిశీలిస్తే.. 

రాజ్యసభలో ఇలా.. 
ఒక వ్యక్తి అటువైపు ఉన్న ఎంతమందిని ఒకేసారి ఎదుర్కొంటున్నాడన్నది దేశం చూస్తోందని మోదీ చెప్పారు. బీజేపీ వ్యతిరేకించే పార్టీలు మరింత బురదజల్లుతున్నాయని.. అందులో నుందచే కమలం (బీజేపీ పార్టీ గుర్తు) వికసిస్తుందని అన్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. అనేక ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి కనీసం 90 సార్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను ఉపయోగించాయని ఆరోపించారు. ఎన్సీపీ, డీఎంకే, టీడీపీ, లెఫ్ట్.. వంటి పార్టీలు గతంలో వారి ప్రభుత్వాలను కూల్చివేసిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని మోదీ ప్రశ్నించారు. 

నెహ్రూ ఇంటిపేరును వాడుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని ప్రధాని మోదీ గాంధీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. ‘‘నేను కొన్ని వార్తాపత్రికలలో చదివాను.. నేను దానిని ధృవీకరించలేదు. అయితే 600 ప్రభుత్వ పథకాలు గాంధీ-నెహ్రూ కుటుంబం పేరు మీద మాత్రమే ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. ఎవరైనా నెహ్రూ పేరు చెప్పకపోతే కొందరికి కోపం వచ్చి రక్తం ఉడికిపోతుంది. నెహ్రూ పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తారు. సాధారణంగా నెహ్రూజీ పేరు మనం పక్కన పెడితే.. ఆయన దేశానికి మొదటి ప్రధానమంత్రి కాబట్టి మన తప్పును సరిదిద్దుకుంటాం. కానీ ఆయన వంశంలోని వ్యక్తులు నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నెహ్రూ ఇంటిపేరు పెట్టుకోవడానికి సిగ్గేమిటి? ఇంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని అంగీకరించడానికి ఆయన కుటుంబం సిద్ధంగా లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదన్న ఆరోపణలపై మోదీ స్పందిస్తూ.. తాను ప్రధానమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఉన్నానని, సమాఖ్య విధానం యొక్క ప్రాముఖ్యతను తనకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ టోకెనిజం, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని.. సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో ఆసక్తి చూపడం లేదని ప్రధాని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ క్రీడలు ఆడుతున్నాయని.. తమను తాము రక్షించుకునేందుకు మార్గం వెతుకుతున్నాయని ప్రధాని ఆరోపించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేశం సామాన్యుల చెమట, ధైర్యంతో తయారైన దేశమని కొందరు అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ఈ దేశం ఏ కుటుంబ సొత్తు కాదని చెప్పారు. 

లోక్‌సభలో ఇలా.. 
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్టుపై స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సమయంలో ప్రధాని మోదీ వాటికి సూటిగా సమాధానం చెప్పకుండా.. దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణంకాలను వివరించారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. యూపీఏ హయాంలో దేశం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఈడీ అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని.. ఓటర్లు చేయలేనిది చేసిందని సెటైర్లు వేశారు. హార్వర్డ్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని పెద్ద విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ పతనంపై అధ్యయనం చేశాయని అన్నారు. 

ప్రతిపక్షాలు వారికి వారే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. భారతదేశం బలహీనపడిందని, భారతదేశం ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వార్తాపత్రికల ముఖ్యాంశాలు లేదా టీవీ విజువల్స్ వల్ల మోడీపై ప్రజలు విశ్వాసం ఉంచలేదని అన్నారు. కానీ తన సంవత్సరాల అంకితభావం వల్ల తనపై ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. కోట్లాది ప్రజల విశ్వాసం తన రక్షణ కవచం అని.. తాను 25 కోట్ల కుటుంబాలలో సభ్యుడినని.. విపక్షాల దూషణలు, ఆరోపణలతో అది విచ్ఛిన్నం కాదని తెలిపారు. విపత్కర సమయాల్లో మోదీ తమ సహాయానికి వచ్చారని ప్రజలకు తెలుసని.. మీ దూషణలు, ఆరోపణలను వారు ఎలా అంగీకరిస్తారని? అని ప్రధాని మోదీ ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.

ఆరోపణలు చేయడంలో ప్రతిపక్షం గత 9 సంవత్సరాలు వృధా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తొమిదేళ్లలో నిర్మాణాత్మక విమర్శల స్థానంలో బలవంతపు విమర్శలు వచ్చాయని అన్నారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంపై తాము దృష్టి సారించామని చెప్పారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ఇటీవల లాల్ చౌక్‌కు వచ్చిన వారు ఈరోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా తిరుగుతున్నారో చూసి ఉంటారని రాహుల్ గాంధీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 90వ దశకంలో లాల్ చౌక్‌లో తాను జెండాను ఎగురవేయాలని తీర్మానం చేయడంతో తీవ్రవాదులు నిరసనగా పోస్టర్లు వేశారని.. కానీ నేడు అక్కడ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ప్రతి ఇంటికీ త్రివర్ణ పతాకం కార్యక్రమం విజయవంతమవుతోందని చెప్పారు.