ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘‘3D’’ మంత్రాన్ని జపించారు.  ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశంలోని ప్రజలను ‘‘పరివార్జన్’’ (కుటుంబ సభ్యులు) అని పదేపదే ప్రస్తావించారు. 

ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘‘3D’’ మంత్రాన్ని జపించారు. నేడు భారత్‌కు జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం (demography, democracy, diversity) ఉన్నాయని.. ఈ మూడింటితో కలిసి దేశం కలలను సాకారం చేయగల సామర్థ్యం ఉందని చెప్పారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశంలోని ప్రజలను ‘‘పరివార్జన్’’ (కుటుంబ సభ్యులు) అని పదేపదే ప్రస్తావించారు. 

“నేను గత 1000 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే దేశం ముందు మరోసారి అవకాశం ఉందని నేను చూస్తున్నాను. ఇది అమృత్ కాల్ మొదటి సంవత్సరం. ఇప్పుడు మనం ఏది చేసినా, మనం ఏ అడుగు వేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. అది రాబోయే 1,000 సంవత్సరాలకు మన దిశను నిర్దేశిస్తుంది. అది భారతదేశ విధిని వ్రాయబోతోంది. దేశంలో అవకాశాలకు కొదవలేదు.. అంతులేని అవకాశాలను అందించే సత్తా దేశానికి ఉంది.

Also Read: దేశం మణిపూర్ ప్రజలతో ఉంది.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ..

కోవిడ్ 19 మహమ్మారి తర్వాత కొత్త ప్రపంచ క్రమం, కొత్త భౌగోళిక-రాజకీయ సమీకరణం రూపుదిద్దుకుంటోంది. భౌగోళిక రాజకీయాల నిర్వచనం మారుతోంది. నేడు 140 కోట్ల మంది సామర్థ్యం కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో చూడవచ్చు. భారతదేశం సామర్ధ్యం, అవకాశాలు విశ్వాసంకు సంబంధించిన కొత్త శిఖరాలను దాటబోతున్నాయి. ఈ కొత్త విశ్వాస శిఖరాలు.. కొత్త సామర్థ్యాలతో ముందుకు సాగుతాయి. నేడు భారతదేశం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందింది. . గత సంవత్సర కాలంగా G20 అనేక ఈవెంట్‌లు భారతదేశంలోని ప్రతి మూలలో జరిగిన తీరు.. భారతదేశ సాధారణ ప్రజల సామర్థ్యాన్ని, భారతదేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. 

సంస్కరణలు, పనితీరు, పరివర్తన దేశాన్ని మారుస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నాం. నేడు 140 కోట్ల మంది భారతీయుల కృషితో ఐదో స్థానానికి చేరుకున్నాం. దేశాన్ని తన కబంధ హస్తాల్లో ఉంచిన అవినీతి భూతం నుంచి బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించాము’’ అని ప్రధాని మోదీ చెప్పారు. 

సంప్రదాయ నైపుణ్యాలు ఉన్న వారి కోసం వచ్చే నెలలో రూ. 13,000 నుంచి 15,000 కోట్ల కేటాయింపుతో విశ్వకర్మ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. జన్ ఔషధి కేంద్రాలను ప్రభుత్వం 10 వేల నుంచి 25 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని, ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

‘‘ప్ర‌పంచం ఇంకా క‌రోనా నుంచి కోలుకోలేదు.. యుద్ధం మ‌రో సంక్షోభానికి దారి తీసింది. నేడు ప్ర‌పంచం ద్రవ్యోల్బ‌ణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం మొత్తం గ్లోబల్ ఎకానమీని తన కబంధ హస్తాల్లో ఉంచింది. మనకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు, ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకుంటాము. కానీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉన్నందున మనం సంతృప్తి చెందలేము. ద్రవ్యోల్బణం భారం నా దేశ పౌరులపై మరింత పడకుండా చూడడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. మేము ఆ చర్యలు తీసుకుంటాము. నా ప్రయత్నాలు కొనసాగుతాయి’’ మోదీ అన్నారు.