లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 29 ఏళ్ల తర్వాత అయోధ్యలో బుధవారం నాడు అడుగుపెట్టాడు.అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాతే పవిత్రమైన అయోధ్యలో అడుగుపెడుతానని మోడీ 1992లో ప్రకటించారు. అప్పటి నుండి ఆయన అయోధ్యలో అడుగుపెట్టలేదు.

29 ఏళ్ల క్రితం అయోధ్యలో మోడీ పర్యటించిన సమయంలో మోడీ తిరంగా ర్యాలీ కన్వీనర్ గా ఉన్నాడు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ  తిరంగా ర్యాలీని బీజేపీ చేపట్టింది. బీజేపీ అప్పటి జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ ఈ ర్యాలీని చేపట్టారు.

also read:మళ్లీ అప్పుడొస్తా, 28 ఏళ్ల క్రితం మోడీ సంకల్పం: నేడు సాకారం చేసుకొంటున్న ప్రధాని

ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ , కాశ్మీర్ లను  కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి ఏడాదైంది.గత ఏడాది ఫైజాబాద్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. కానీ, ఆయన అయోధ్యను సందర్శించలేదు.

అయోధ్యను సందర్శిస్తున్న మొట్ట మొదటి ప్రధానమంత్రి మోడీయేనని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాముడు పుట్టిన ప్రాంతంగా అయోధ్యను భావిస్తారు. అంతేకాదు హనుమంతుడి మందిరం హనుమాన్ ఘరిని సందర్శించిన మొదటి  ప్రధాని కూడ మోడీయేనని యూపీ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.రామ మందిరాన్ని నిర్మిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 

ఇవాళ జరిగే రామ మందిర భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని 1990లో మోడీ దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన వారిలో ప్రముఖుడు. 16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆయన అప్పట్లో ప్రచారం నిర్వహించాడు. 

1990లలో దేశ వ్యాప్తంగా సాగిన ఈ ప్రచారం బీజేపీని బలమైన శక్తిగా మార్చింది.1992లో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటన దేశంలో అల్లర్లకు కారణమైంది.

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో బీజేపీ సీనియర్లు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.