New parliament Building: భారతదేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని ఈనెల 26వ తేదీన ప్రధాని మోదీ జాతికి అంకింత చేయనున్నారు.

New parliament Building: భారత దేశ నూతన పార్లమెంటు భవన నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరులోగా నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం తుది మెరుగుల దిద్దుకుంటున్న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ(Narendra Modi) ఈ నెల 26న జాతికి అంకింత చేయనున్నారని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న వేళ ఈ భవన ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.

తొమ్మిది ఏండ్ల క్రితం 2014, మే 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం.. జూలైలో ప్రారంభమయ్యే రాబోయే వర్షాకాల సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశం లేదు. జీ20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం ఈ ఏడాది చివర్లో కొత్త భవనంలో జరగవచ్చని ఊహాగానాలు ఉన్నాయని ఈ పరిణామానికి సంబంధించిన వర్గాలు తెలిపాయి. 2023 జి20కి భారత్‌ అధ్యక్షత వహిస్తోంది.

పార్లమెంటు భవన నిర్మాణ విశేషాలు..

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఘనతను ప్రపంచ వ్యాప్తం చేసేలా..2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ ఈ నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 970 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది.

ఈ ప్రాజెక్టు లో భాగంగా..రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్యపథ్‌ మధ్య ఉన్న 3 కిలోమీటర్ల స్థలంలో పార్లమెంట్‌ భవనం సహా కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మించారు. అదే సమయంలో సెంట్రల్‌ సెక్రెటేరియట్‌, నూతన కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లను కూడా ఏర్పాటు చేశారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త నాలుగు అంతస్తుల భవనంలో ఏకకాలంలో 1,224 మంది ఎంపీలు కూర్చునే అవకాశం ఉంది. 

త్రిభుజాకారంలో ఉన్న పార్లమెంట్ హౌస్ నిర్మాణం జనవరి 15, 2021న ప్రారంభమై ఆగస్టు 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కొత్త పార్లమెంటు భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి, వీటిని జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ , కర్మ ద్వార్ అని పిలుస్తారు.ఈ భవనంలో ఎంపీలు, వీఐపీలు, సందర్శకులకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ భవనానికి మరొక ఆకర్షణ రాజ్యాంగ హాల్.. ఇది దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి నిర్మించబడింది.

భారత రాజ్యాంగం యొక్క అసలు ప్రతిని హాలులో ఉంచారు. ఇందులో లైబ్రరీ, అనేక కమిటీ గదులు, భోజనాల గది కూడా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ హౌస్‌లో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధానుల ఫోటోలు పార్లమెంటు భవనంలో కొలువుతీరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జూలైలో ఈ కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలో జరపాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.