చెన్నైలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు టీచర్లు చదువు పేరుతో ఒత్తిడి తెస్తున్నారని, హింసిస్తున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ లో వారిద్దరి పేర్లూ రాసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 

చెన్నై : తమిళనాడులో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఒక బాలిక అనుమానస్పద మృతి చెందింది. ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు, ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. తమిళనాడులోని కాళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో శ్రీమతి(17) అనే బాలిక ప్లస్ -2 చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా కుటుంబీకులు, బంధువులు అక్కడే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. కాగా, ఆదివారం గుర్తుతెలియని వందలాది యువకులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చొరబడి విధ్వంసానికి దిగారు. వీరిని ఆపే క్రమంలోడీఐజీ పాండియన్ తో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. మంత్రులు, డీజీపి, హోం శాఖ కార్యదర్శి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

తమిళనాడులోని కళ్లకురిచ్చి సమీపంలోని చిన్న సేలం వద్ద ఉన్న ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇద్దరు ఉపాధ్యాయులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నోట్‌ లో రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను ఖండించగా, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళ్లకురిచ్చి-సేలం రహదారిని దిగ్బంధించి, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం హాస్టల్ భవనం వాచ్‌మెన్ నేలపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పాఠశాల అధికారులకు సమాచారం అందించాడు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

మృతదేహం దగ్గర దొరికిన ఒక నోట్‌లో, బాలిక ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లు రాసి ఉన్నాయి. వారు తనను, ఇంకో ఇద్దరు విద్యార్థులను నిరంతరం చదువుకోవాలని బలవంతం చేస్తూ హింసించారని పేర్కొంది. “ఇద్దరు ఉపాధ్యాయులను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆమె చదువు మీద కాకుండా వేరే యాక్టివిటీల మీద ఆసక్తి ఎక్కువ కాబట్టి వారు ఆమెను మరింత ఏకాగ్రతతో, కష్టపడి చదవాలని చెప్పినట్లువారు మాకు చెప్పారు” అని కళ్లకురిచ్చి ఎస్పీ ఎస్ సెల్వకుమార్ తెలిపారు.

మిస్టరీగా సుభాష్ నగర్ బాలిక మృతి.. ఆ మూడు గంటలు ఏమైంది?.. ఇంకా వీడని సస్పెన్స్...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు బంధువులతో కలసి కళ్లకురిచ్చి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఆమె మృతికి న్యాయం చేయాలని కోరుతూ దాదాపు 50 మంది కుటుంబ సభ్యులు కళ్లకురిచి-సేలం హైవే వద్ద 'రోడ్ రోకో' నిర్వహించారని, పాఠశాల యాజమాన్యంవల్లే ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని వారు ఆరోపించారని పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను ఆవరణలోకి రానివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. CrPC సెక్షన్ 174 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేయబడింది. “మేం విచారణ జరుపుతున్నాము. బాలికను ఈ టీచర్లు తిట్టారని, మిగతా టీచర్లకు కూడా ఈ విషయం తెలుసునని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. పోస్టుమార్టం నిర్వహించి, పూర్తికాగానే మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్పీ సెల్వకుమార్ తెలిపారు.