భూమాతను పరిరక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో అర్ధశతాబ్దం కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. దీనిలో భాగంగా ఐరాస జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 5, 1972న పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నాటి నుంచి ప్రతి ఏడాది ఇదే రోజున ఏదైనా ఓ నగరంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి త‌గు చ‌ర్యలు చేప‌ట్టేలా ప్రోత్సహించ‌డ‌మే పర్యావరణ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఇక అప్పట్నుంచి ప్రతి ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 

తాజాగా ఈ ఏడాది కరోనా విలయతాండవం వున్నా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు కూడా మొక్కను నాటాడు. అయితే అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అదేంటి మంచి పనిచేస్తే పోలీసులు అభినందించాలి కానీ ఇలా వెతకడం ఎందుకు అంటారా. అతను నాటింది గంజాయి మొక్కలు కాబట్టి.

Also Read:ఐదు రాష్ట్రాలకు కొరకరాని కొయ్య.. మోస్ట్ వాంటెడ్ గంజాయ స్మగ్లర్ అరెస్ట్

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని కందిచీరా ప్రాంతంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అయితే వాటిలో గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. స్థానికులు మొక్కలతో ఫొటోలు దిగుతున్న సమయంలో వీటిని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గంజాయి సాగుపై కేసు నమోదైన ఓ యువకుడు వీటిని నాటినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.