Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ మాజీ ఎంపీ చందన్ మిత్ర మృతి.. ప్రధాని సంతాపం

రాజ్యసభ ఎంపీగా రెండు సార్లు సేవలందించిన చందన్ మిత్ర(65) కన్నుమూశారు. పయనీర్ ఎడిటర్‌గా సేవలందించిన ఆయన మరణించినట్టు కుమారుడు కుషాన్ మిత్ర వెల్లడించారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
 

pioneer editor and former rajya sabha MP chandan mitra passes away
Author
New Delhi, First Published Sep 2, 2021, 12:29 PM IST

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రముఖ జర్నలిస్టు, పయనీర్ న్యూస్ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేసిన చందన్ మిత్ర(65) కన్నుమూశారు. ఆయన కుమారుడు కుషాన్ మిత్ర ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంతకాలంగా చందన్ మిత్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు తెలిపారు. రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన పయనీర్ న్యూస్ పేపర్‌ ప్రింటర్, పబ్లిషర్‌గా జూన్‌లో రాజీనామా చేశారు.

చందన్ మిత్ర మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చందన్ మిత్ర మరణం తనను కలచివేసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనలకు ఎప్పటికీ గుర్తుండిపోతారని, రాజకీయాలు, మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని వివరించారు. ఆయన కుటుంబీకులు, శ్రేయోభిలాషులకు సానుభూతి ప్రకటించారు. చందన్ మిత్ర అద్భుత జర్నలిస్టు అని, ఆయన మృతి తనకు వ్యక్తిగతమైన నష్టంగానే భావిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రామ్ మాధవ్, స్వపన్ దాస్‌గుప్తాలు చందన్ మిత్రతో వారి అనుబంధాలను గుర్తుచేసుకుంటూ బాధను వ్యక్తపరిచారు.

చందన్ మిత్ర 2018లో బీజేపీని వీడారు. అనంతరం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో కొనసాగినంత కాలం టీఎంసీని విమర్శించి మళ్లీ అదే పార్టీని ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మెరుగైన పరిస్థితులు కల్పించడానికే ఈ పార్టీలో చేరుతున్నట్టు అప్పుడు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios