G20 summit 2023 : జీ 20 డిన్నర్‌కు అంబానీ, అదానీలను ఆహ్వానించారా .. ఫేక్ న్యూస్‌గా పీఐబీ ఫ్యాక్ట్
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కేంద్రం జీ20 డిన్నర్‌కు ఆహ్వానించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. పీఐబీ ఫాక్ట్ చెక్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఈ దావాను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి చెక్ పెట్టింది.

మరికొద్దిగంటల్లో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అతిథులు ఒక్కొక్కరిగా భారత్‌కు చేరుకుంటున్నారు. వీరంతా ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేస్తున్నారు. జీ20 సమ్మిట్ నేపథ్యంలో దేశ రాజధాని శత్రు దుర్బేద్ధ్యంగా మారిపోయింది. సాయుధ బలగాలు డేగ కళ్లతో పహారా కాస్తున్నాయి. ఇదిలావుండగా శనివారం భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు జీ20 ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, నితీష్ కుమార్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
అయితే సోషల్ మీడియా రాకతో నిరాధారమైన, అసత్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కోవలోనే దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కేంద్రం జీ20 డిన్నర్‌కు ఆహ్వానించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆ వెంటనే కేంద్ర సమాచార ప్రసార శాఖలోని ‘‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’’ ఈ ఫేక్ వార్తలకు తెరదించింది.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నిన్న ఒక వార్త ఇచ్చింది. దీని ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వంటి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఈ జీ 20 విందులో పాల్గొంటారని రాయిటర్స్ తెలిపింది. అయితే మీడియా కథనాలలో చేస్తున్న వాదనలు తప్పని ప్రభుత్వ సంస్థ పిఐబి స్పష్టం చేసింది. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు జీ20 విందుకు అలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేసింది.
ఈ క్లెయిమ్ ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. ట్విట్టర్ పోస్ట్ ద్వారా చెప్పింది. సెప్టెంబరు 9న భారత్ మండపంలో జరిగే జీ 20 డిన్నర్‌కు ఏ బిజినెస్ లీడర్‌ను ఆహ్వానించడం లేదు లేదా ఎవరూ హాజరు కావడం లేదు. పీఐబీ ఫాక్ట్ చెక్ తన అధికారిక హ్యాండిల్ ద్వారా ఈ దావాను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి చెక్ పెట్టింది.