Delhi HC On Covid Protocol: విమానాశ్రయాలు, విమానాల్లో మాస్క్‌లను కచ్చితంగా ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాస్కులు ధరించని వారిపై భారీ జరిమానా విధించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
Delhi HC On Covid Protocol: విమానాశ్రయాలు, విమానాలలో మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు(Delhi HC) శుక్రవారం ఆదేశించింది. దీనితో పాటు.. కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదని, నిరంతరం కరోనా విజృంభిస్తోందని కోర్టు తెలిపింది.
కోవిడ్ -19 నివారణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా.. జరిమానా కూడా విధించాలని కోర్టు పేర్కొంది. అలాంటి వారిని 'నో-ఫ్లై' (నిషిద్ధ విమానాలు) జాబితాలో చేర్చాలని కోర్టు పేర్కొంది. నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కరోనా నిబంధనలు అమలు చేయడమే కాకుండా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని, నిబంధనలను పాటించేందుకు తగిన కఠినత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలను సీరియస్‌గా పాటించడం లేదని చాలాసార్లు గమనించామని, కాబట్టి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)తో సహా ఇతర ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ సచిన్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. .
ఆదేశాలు జారీ చేయాలని డిజిసిఎను కోర్టు కోరింది
ఇందుకోసం డీజీసీఏ విమానయాన సంస్థలకు వేర్వేరుగా బైండింగ్ ఆదేశాలు జారీ చేయాలని, తద్వారా నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లలోని ఉద్యోగులు, ఎయిర్‌హోస్టెస్‌లు, కెప్టెన్లు, పైలట్లు, ఇతర సిబ్బందికి అధికారం ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ముసుగులు ధరించడం,చేతులు కడుక్కోవడానికి సంబంధించి అంశాలను పేర్కొంది.
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు - కోర్టు
కోవిడ్ -19 నియంత్రణ నియమాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మే 10న మరో ఉత్తర్వును జారీ చేసిందని DGCA న్యాయవాది అంజనా గోసైన్ సమర్పించడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. గోసైన్ స్వయంగా కోవిడ్-19 బారిన పడ్డారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. విమానాశ్రయాలు, విమానాల్లో మాస్క్‌లకు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. "మహమ్మారి ఇంకా ముగియలేదు, నిరంతరం కరోనా కేసులు పెరుగుతున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి " అని బెంచ్ తెలిపింది.
ఈ కేసు తదుపరి విచారణ జూలై 18న
ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని సరిగ్గా పాటించడం లేదని, ఇదే అసలు సమస్య అని కోర్టు పేర్కొంది. మార్గదర్శకాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తదుపరి విచారణకు జూలై 18ని నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి అనుభవం ఆధారంగా దాఖలైన పిఐఎల్‌పై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. విమానాశ్రయం నుండి విమానానికి వెళ్లే ప్రయాణికులు మాస్క్‌లు ధరించకపోవడాన్ని జస్టిస్ సి హరి శంకర్ గమనించారు. ఆ తర్వాత మార్చి 8, 2021న పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.
