అనుకున్నట్లుగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టాయి. వరుసగా ఆరో రోజు ఆదివారం కూడా ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈ ధరలతో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతున్నాయి.

గ్యాప్ లేకుండా ప్రతిరోజూ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగాయి.

పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్‌పై 30 పైసల నుంచి రూ.50 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 

ఈ పెంపుతో మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో అప్పుడే పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టేసింది. ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఒకరు తెలిపారు.

సాధారణ పెట్రోల్‌ ధర రూ. 97.38గా ఉంది. అదే ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో‌ రూ.95.21కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23 చేరుకున్నాయి.

మరోవైపు వాహనదారులకు ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని అస్సాం ప్రభుత్వం తీసుకుంది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి రూ. 60,784.03 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్, మద్యం ధరల తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు