ఆదిపురుష్ సినిమా పై విడుదలైన రోజే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. హిందూ దేవుళ్ల వేషధారణ, రూపం గురించి రామాయణంలో స్పష్టమైన వర్ణనలు ఉన్నాయని, కానీ, అందుకు భిన్నమైన రూపాలను ఈ సినిమాలో చూపించారని, వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఈ పిటిషన్ వేశారు.  

న్యూఢిల్లీ: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈ రోజు విడుదలైంది. తొలి రోజే ఆ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో హిందు సేన ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుంచి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని హిందు సేన డిమాండ్ చేసింది. రావణ, శ్రీరాముడి, సీతా దేవి, హనుమంతుడికి సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాలని పేర్కొంది. రామాయణంలో వర్ణించినట్టుగా కాకుండా అందుకు భిన్నమైన వేషధారణ, రూపాల్లో వీరి అవతారాలు సినిమాలో ఉన్నాయని తెలిపింది.

హిందువుల దృష్టిలో రాముడు, సీతా, హనుమాన్‌లకు ఒక ప్రత్యేకమైన రూపం ఉన్నదని హిందు సేన జాతీయ అధ్యక్షుడు దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వారి పవిత్ర రూపాలను సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు మార్చినా.. సవరించినా అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. ఆది పురుష్ సినిమాలో దేవుళ్ల పాత్రలను సరిగా చూపించలేదని, ఇది హిందూ నాగరికతకు, హిందూ మత దేవుళ్లకే అవమానం అని ఆరోపించారు. 

Also Read: Hyderabad: కుటుంబం అంతా పడుకున్నాక రాత్రి ఇంట్లోనే వివాహిత ఆత్మహత్య.. ఎందుకంటే?

రామాయణ పవిత్ర గ్రంథంలో వారి హేర్ స్టైల్, గడ్డం, డ్రెస్సింగ్ గురించి కూడా స్పష్టమైన వర్ణనలు ఉన్నాయని, వాటిలో సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు మార్పులు చేస్తే మాత్రం అది భక్తుల మనోభావాలను గాయపరిచినట్టే అని తెలిపారు. కాబట్టి, భక్తుల మనోభావాలకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వివరించారు.

మార్పులు చేసిన హిందూ దేవుళ్లను బహిరంగంగా ప్రదర్శించడం మత స్వేచ్ఛను భంగం చేసినట్టేనని, ఆర్టికల్ 26లో మత వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్టేనని పేర్కొన్నారు.