ప్రముఖ ఫర్నిచర్, హోం ప్రొడక్ట్స్ సంస్థ పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి కన్నుమూశారు.
ప్రముఖ ఫర్నిచర్, హోం ప్రొడక్ట్స్ సంస్థ పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి కన్నుమూశారు. ప్రస్తుతం లేహ్‌లో ఉన్న అంబరీష్ మూర్తి గుండెపోటుతో మరణించినట్లు పెప్పర్‌ఫ్రై స్టోర్ మరొక సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నా స్నేహితుడు, గురువు, సోదరుడు, ఆత్మ సహచరుడు అంబరీష్ మూర్తి ఇక లేరని తెలియజేస్తున్నందుకు చాలా బాధపడుతున్నాను. నిన్న రాత్రి లేహ్‌లో గుండెపోటుకు గురికావడంతో ఆయన మరణించారు. దయచేసి అతని కోసం, అతని కుటుంబ సభ్యులకు,సన్నిహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించండి’’ అని ఆశిష్ షా పేర్కొన్నారు.
అంబరీష్ మూర్తి మూర్తి వ్యాపార ప్రపంచంలోకి 1996 జూన్‌లో ప్రవేశించారు. క్యాడ్‌బరీలో సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా చేరడంతో ఆయన అడుగులు ప్రారంభమమ్యాయి. అక్కడ మూర్తి ఐదున్నర సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత మూర్తి తన నైపుణ్యంతో ప్రుడెన్షియల్ ఐసీఐసీఐ ఏఎంసీ (ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్) ద్వారా ఆర్థిక రంగంలోకి ప్రవేశించారు. మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్‌లకు వీపీగా అతని ప్రయాణం రెండేళ్ల పాటు కొనసాగింది.
ఆ తర్వాత లెవీస్‌లో ఐదు నెలల పనిచేశారు. ఈ సమయంలోనే అతను తన సొంత వెంచర్ అయిన ఆరిజిన్ రిసోర్సెస్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ భారతీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సహాయం చేయడానికి రూపొందించబడింది. అతను 2005లో స్టార్టప్‌ను మూసివేసి బ్రిటానియాలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరాడు. ఏడు నెలల తర్వాత.. మూర్తి eBay ఇండియాలో చేరారు.. ఫిలిప్పీన్స్, మలేషియా మరియు భారతదేశానికి కంట్రీ మేనేజర్‌గా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత.. మూర్తి 2011 జూన్‌లో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని ప్రారంభించారు.
