Asianet News TeluguAsianet News Telugu

స్వతంత్ర భారతంలో నోబెల్ అవార్డు గ్రహీతలు వీరే.. కీలక వివరాలు తెలుసుకోండి..!

అంతర్జాతీయంగా ప్రఖ్యాత అవార్డుగా పేర్గాంచిన నోబెల్ బహుమానాన్ని భారతీయులు పలు రంగాల్లో పొందారు. స్వాతంత్ర్యం రాకముందే ఈ పరంపర మొదలైంది. అయితే, స్వాతంత్ర్యం పొంది 75 వసంతాలు గడుస్తున్న సందర్భంలో స్వతంత్ర భారతంలో ఈ అవార్డు గెలుచుకున్న వారి వివరాలు చూద్దాం.
 

peoples who received nobel award in independent india indian nobel laureates
Author
Hyderabad, First Published Aug 5, 2022, 2:19 PM IST

1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత్ ఎన్నో విజయాలు సాధించింది. మరెంతో అభివృద్ధి చెందింది. ఎన్నో జాఢ్యాలు వదిలి పురోగమించింది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలకడగా ముందడుగు వేస్తున్నది. ఈ అభివృద్ధి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. భిన్న రంగాల్లో భారత్ తన దైన మేధస్సును, కృషిని విశ్వ యవనికపై వెల్లడిస్తూనే ఉన్నది. అంతర్జాతీయంగా నిర్దేశిత రంగాల్లో కృషిని గుర్తించి సత్కరించే ప్రసిద్ధ పురస్కారం నోబెల్ అని తెలిసిందే. ఈ నోబెల్ బహుమతిని స్వతంత్ర భారతంలో ఎందరు పొందారు? వారెవరు? భారత్‌తో సంబంధముండి నోబెల్ పురస్కారం పొందిన వారి వివరాలనూ చూద్దాం.

భారత దేశానికి ఆ మాటకొస్తే ఆసియా ఖండానికే తొలి నోబెల్ పురస్కారాన్ని గెలుచుకు వచ్చిన ఘనత రవీంద్రుడికే దక్కింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో 1913లో నోబెల్ పురస్కారాన్ని పొందారు.

స్వతంత్ర భారతంలో నోబెల్ పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. శాంతి విభాగంలో మదర్ థెరిస్సా 1979లో నోబెల్ బహుమతి పొందారు. 1998లో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో ఈ అత్యున్నత పురస్కారాన్ని పొందారు. 2014లో కైలాష్ సత్యర్థి నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్నారు.

మదర్ థెరిసా:
మదర్ థెరిసా 1948 నుంచి పేదలకు సేవలు అందించడం మొదలు పెట్టారు. కలకత్తా కేంద్రంగా ఆమె తన మిషనరీ సేవలను అందించారు. భారత పౌరసత్వం పొందారు. 87 ఏళ్ల వయసులో కలకత్తాలోనే ప్రాణాలొదిలారు.

అమర్త్యసేన్:
పశ్చిమ బెంగాల్‌(బ్రిటీష్ ఇండియా శాంతినికేతన్)లో 1933లో జన్మించిన అమర్త్యసేన్ అర్థ శాస్త్రంలో విశేష సేవలు అందించారు. 1972 నుంచి యూకే, యూఎస్‌లలో పని చేస్తూ.. బోధనలు చేశారు. ఆయన వెల్ఫేర్ ఎకనామిక్స్, సోషల్ చాయిస్ థియరీ, ఎకనమిక్ అండ్ సోషల్ జస్టిస్ అంశాల్లో కృషి సలిపారు. అమర్త్య సేన కేవలం అర్థశాస్త్ర నిపుణులే కాదు.. ఫిలాసఫర్ కూడా.

కైలాష్ సత్యర్థి:
కైలాష్ సత్యర్థి మధ్యప్రదేశ్‌లో 1954లో జన్మించారు. పిల్లల హక్కులు, పిల్లల విద్య కోసం పరితపిస్తారు. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన నిర్విరామ పోరాటం చేశారు. ప్రతి ఒక్కరికీ విద్యను పొందే హక్కు ఉంటుందని గళమెత్తారు. 2014లో ఆయన మలాల యూసుఫ్‌జాయ్‌తోపాటు నోబెల్ శాంతి బహుమతి పొందారు.

భారత్ ఇంకా స్వాతంత్ర్యం పొందడానికి పూర్వం రవీంద్ర నాథ్ తర్వాత 1930లో సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందారు.

ఇక భారత మూలాలు ఉన్న నలుగురు ప్రముఖులు నోబెల్ పొందారు. 1968లో ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో హరగోబింద్ ఖురానా నోబెల్ పొందారు. ఈయన బ్రిటీష్ ఇండియాలో రాయ్‌పూర్‌లో జన్మించారు. 1983లో సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ ఫిజిక్స్‌లో నోబెల్ పొందారు. ఈయన బ్రిటీష్ ఇండియాలో లాహోర్‌లో జన్మించారు. 2009లో వెంకి రామకృష్ణన్ రసాయన శాస్త్రంలో నోబెల్ పొందారు. ఈయన ఇండియాలోని చిదంబరంలో జన్మించారు. కలకత్తాలో జన్మించి యూఎస్‌లో నివసిస్తున్న అభిజిత్ బెనర్జీ 2019లో అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios