కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ ప్రజలు మిఠాయిలు పంచారు - బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ..
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రజలు మిఠాయిలు పంచి పెట్టారని బీజేపీ నేత మనోజ్ తివారీ అన్నారు. రాజధాని ప్రజలంతా కేజ్రీవాల్ పై కోపంగా ఉన్నారని ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును పురస్కరించుకుని ఢిల్లీ ప్రజలు మిఠాయిలు పంచుతున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఆప్ అధినేత దేశ రాజధానిని దోచుకున్నారని ఆయన అన్నారు.
‘‘ఢిల్లీ ప్రజలు ఆయన (కేజ్రీవాల్)పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన అరెస్టు తర్వాత స్వీట్లు పంచిపెట్టారు. ఆయన ప్రభుత్వం ఢిల్లీలో ఏ పనీ చేయలేదు. కేవలం దోచుకుని జేబులు నింపుకుంది. కేజ్రీవాల్ ఢిల్లీని దోచుకున్నారు.’’ అని ఆరోపించారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతామని పదేపదే చెబుతున్న వారు గుర్తుంచుకోండి. జైలు నుంచి గ్యాంగులు నడపడం మనం చూశాం. ప్రభుత్వాన్ని నడపటం కాదు.’’ అని మనోజ్ తివారీ అన్నారు.
కాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారని, ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ శుక్రవారం ప్రకటించింది. కేజ్రీవాల్ సీఎంగా ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ‘‘ప్రజలు ఏం చెబితే అది అరవింద్ కేజ్రీవాల్ చేస్తారు. ప్రజలు చెప్పిన దాని ఆధారంగానే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా ఆయన ఎమ్మెల్యేలందరినీ సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, కౌన్సిలర్లను కలిశారు. వారు అన్ని వార్డుల ప్రజలతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని అందరూ చెప్పారు’’ అని తెలిపారు