ఒకప్పుడు 10 వేల జీతం.. ఇప్పుడు కోట్ల రూపాయల సంపాదన.. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సక్సెస్ స్టోరీ..
జీవితంలో విజయం సాధించాలన్న తపన.. ఎన్ని కష్టాలనైనా ఓడించేస్తుంది. ఎన్నో కష్టాలు పడి ఉన్న శిఖరాలను అధిరోహించిన వారిలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఒకరు. ఈయన ఒకప్పుడు కేవలం 10 వేలకు ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు. ఈయన సక్సెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే?
పెద్దనోట్ల రద్దు తెచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. అప్పుడు దేశం మొత్తంమీద బ్యాంకుల ముందు, ఏటీఎం ల మందు జనం బారుతు తీరారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఆన్ లైన్ లావాదేవీలు చక్కటి పరిష్కారంగా మారాయి. డిజిటల్ బంధాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఫలితంగా పేటీఎం ప్రతి ఒక్కరికీ ఆప్షన్ గా మారింది. పేటీఎం వెనుక ఉన్న విజయ్ శేఖర్ శర్మ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరీ విజయ్ శేఖర్ శర్మ?
1978 లో అలీగఢ్ లో జన్మించిన విజయ్ శేఖర్ శర్మ, సులోమ్ ప్రకాష్, ఆశా శర్మ లకున్న నలుగురు సంతానంలో మూడోవాడు.అతని తండ్రి స్కూల్ టీచర్. ఇతని తల్లి గృహిణి. కానీ అప్పుడు వారి కుమారుడు ఒక మేధావి అని వారు త్వరగానే గ్రహించారు. 15 సంవత్సరాల వయస్సులో విజయ్ శేఖర్ శర్మ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో (అప్పుడు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పిలిచేవారు) చదివాడు. 1997లో B.Tech డిగ్రీ చదువుతున్నప్పుడే విజయ్ శేఖర్ శర్మ డాట్ కామ్ వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుని indiasite.net అనే వెబ్ సైట్ ను ప్రారంభించాడు. అయితే దీన్ని 5 లక్షలకే అమ్మేశాడు. ఇంటర్నెట్ పై ఉన్న అవగాహనతో విజయ్ శేఖర్ శర్మ 2003లో కొంతమంది స్నేహితుల సాయంతో వన్97 కమ్యూనికేషన్స్ అనే వెబ్ సైట్ ను స్థాపించాడు. ఇది సమాచారం, క్రికెట్ రేటింగ్స్, రింగ్ టోన్లు, జోకులు, టెస్ట్ స్కోర్లను అందిస్తుంది. అయినప్పటికీ అతను వ్యాపారం నడవడానికి ఒక ఉద్యోగాన్ని చేయాల్సి వచ్చింది. దానికి అతనికి నెలకు రూ.10వేలు వచ్చేవి.
పేటీఎం ప్రారంభం..
2010లో దేశంలో ప్రారంభించిన 3జీ నెట్ వర్క్ వల్ల భారతీయ ఐటీ ఆధారిత వ్యాపారాల రూపురేఖలు బాగా ప్రభావితమవుతాయని గ్రహించారు. దీంతో పేటీఎంను అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశాడు. అయితే దీన్ని ప్రారంభించిన 10 నెలల్లోనే.. వారు యాప్ లో 15 మిలియన్ల వాలెట్లను ఏర్పాటు చేయగలిగారు. ఎందుకంటే ఈ కొత్త కొత్త డిజిటల్ విభాగం ప్రజల నుంచి ఎంతో ఆధరణ పొందింది. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా పేటీఎం లావాదేవీలు 700 శాతం పెరిగాయని.. ఇది ఆన్ లైన్ పేమెంట్ వ్యవస్థకు పెద్ద విజయమని పేర్కొన్నారు. దీంతో పేటీఎం వేగంగా 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కు చేరుకోగలిగింది.
విజయ్ శేఖర్ శర్మ: నికర విలువ, జీతం
ఫోర్బ్స్ ప్రకారం.. 2022 లో విజయ్ శేఖర్ శర్మ నికర విలువ 1.2 బిలియన్ డాలర్లు . విజయ్ శేఖర్ శర్మ ఏడాదికి రూ.4 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. వచ్చే మూడేళ్ల పాటు ఆయన జీతంలో ఎలాంటి మార్పు ఉండదు. 2022 ఆగస్టులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.విజయ్ శేఖర్ శర్మకు తన వ్యాపారం ప్రారంభం ఎలా ఉన్నా.. అతని కృషి, సంకల్పంతో బిలియనీర్ అయ్యి.. అనతికాలంలోనే ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. ఈయన కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.