పట్నా : పెళ్లి అంటేనే కుటుంబ సభ్యుల హడావిడి. బంధువులు, మిత్రులతో సందడే సందడి. డ్యాన్స్ లతో నానా హంగామా. ఆడ మగ అనే తేడా లేకుండా అంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వివాహ వేడుకలో ఆ మహిళ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యడమే ఆ ప్రాణాలు బలితీసుకోవాల్సి వచ్చింది. 

వెడ్డింగ్ పార్టీలో అతిథులతో కలిసి డ్యాన్స్ చేసినందుకు సహించలేని భర్త ఆమెను కడతేర్చాడు. ఈ దారుణమైన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 

ఖోరంగ్ పూర్ గ్రామానికి చెందిన మునియా దేవి హసదిలోని తన తల్లిదండ్రుల వద్దకు పది రోజుల కిందట పిల్లలతో  కలిసి వచ్చింది. తన బంధవుల వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆమె భర్త రంజిత్ మాంఝీ కూడా వచ్చాడు. సోమవారం రాత్రి భర్త పిల్లలతోకలిసి వివాహ వేడుకలో పాల్గొంది మునియా. 

అయితే అక్కడ డీజే ఏర్పాటు చేశారు. బంధువులు, ఫ్రెండ్స్ ఒత్తిడితో అతిథులతో కలిసి మునియా డ్యాన్స్ వేసింది. వెడ్డింగ్ పార్టీలో మునియా డ్యాన్స్ వెయ్యడంతో ఆగ్రహంతో రెచ్చిపోయాడు రంజిత్ మాంఝీ. వెడ్డింగ్ పార్టీలోనే అందరూ చూస్తుండగానే ఆమెను చితరబాదాడు. 

అనంతరం దగ్గరలోని పశువుల పాకలోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీంతో అక్కడికక్కడే మునియా ప్రాణాలు కోల్పోయింది. మునియా చనిపోయిందని గ్రహించిన రంజిత్ మాంఝీ అక్కడ నుంచి పరారయ్యాడు.