మన చుట్టూ జరుగుతున్న ప్రమాదాలు.. ప్రమాదవశాత్తూ జరిగేవి కొన్నయితే, ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని జరిగేవి మరికొన్ని. తాజాగా దీనిని రుజువు చేసేలా గురుగ్రామ్‌లో ప్రమాదం జరిగింది.

స్థానిక బసాయ్ చౌక్‌లోని బాలాజీ ఆసుపత్రి వద్వ ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మెడికల్ షాపు ధ్వంసమవ్వగా, సుమారు 15 వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీనిని చూసినవారంతా వ్యాన్ అదుపు తప్పి ప్రమాదం జరిగివుంటుందని భావించారు.

కానీ పోలీసులు అసలు నిజం బయటపెట్టే సరికి అంతా షాకయ్యారు. ఓ వ్యక్తి కావాలనే ఇంత బీభత్సం సృష్టించినట్లు తేల్చారు. సదరు బాలాజి ఆసుపత్రిలో ఇద్దరు వృద్దులు చికిత్స పొందుతున్నారు.

వృద్దుల చికిత్సకు సంబంధించి వారి కుటుంబసభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే ఇది పెద్దదవ్వడంతో పాటు కుటుంబసభ్యులు సైతం రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఇంతలో ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్లిన ఒక వ్యక్తి వ్యాన్‌ తీసుకువచ్చి తన కుటుంబంపై ఉన్న కోపాన్ని అలా ఆసుపత్రిపై చూపించాడు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.