దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనం పిట్టల్లా  రాలిపోతున్నారు. ముఖ్యంగా యువతపై వైరస్ అధిక ప్రభావం చూపుతుండటంతో ఏ హాస్పిటల్ చూసినా వారే కనిపిస్తున్నారు. మరణాల శాతంలోనూ యువతరానిదే అత్యధికం.

కోవిడ్ నుంచి కాపాడుకోవడానికి నాటు మందులు, ఆయుర్వేదం అంటూ జనం ప్రత్యామ్నాయ మార్గాలను ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ వూరిలో గ్రామస్తులు రావి చెట్టు కింద కూర్చొని యోగా చేశారు. అలా చేస్తే తమలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా వుంటాయని చెబుతున్నారు. 

వివరాల్లోకి వెళితే.. కరోనా శ్వాస వ్యవస్థపై దాడి చేయడమన్నది ఆ వ్యాధి ప్రధాన లక్షణం. రెండో దశలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోవడం వల్ల అనేక మంది మరణిస్తున్నారు. దీనిని గమనించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా నౌబరీ గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు.

Also Read:ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

ఆక్సిజన్‌ కోసం స్థానికంగా వున్న రావి చెట్టును ఆశ్రయిస్తున్నారు. వీరంతా ఆ చెట్టు కింద అక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. అందుకోసం ఓ యోగా గురువుని కూడా నియమించుకున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఉదయం, సాయంత్రం యోగా నేర్పిస్తున్నారు.   

రావి చెట్టు ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది. ఆయుర్వేద ప్రకారం.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రావిచెట్టు శ్వాసకోశ సమస్యలను నివారించే దివ్యౌషధమని వారు చెబుతున్నారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా, వైద్య పరంగా ఎంతో విశిష్టత ఉందని... రావి చెట్టు కింద కూర్చుంటే ఆక్సిజన్‌ సమస్యలు రావని పేర్కొంటున్నారు. కొవిడ్‌ సోకినవారు చాలా మంది ఇక్కడికి వస్తున్నారని.. అయినప్పటికీ మిగిలిన వారికి ఈ వ్యాధి సోకడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.