రాజస్తాన్‌లో ఓ పేషెంట్‌కు గుండె ఆపరేషన్ చేసి రెండు సర్జికల్ కత్తెర్లు లోపలే మరిచిపోయారు. అందుకే ఆపరేషన్ చేసిన 12 రోజుల తర్వాత తన తండ్రి మరణించాడని కొడుకు ఆరోపించాడు. అంత్యక్రియల తర్వాత అస్థికల కోసం వెళ్లగా రెండు జతల సర్జికల్ సిజర్లు చితి బూడిదలో కనిపించాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఆరోపణలను హాస్పిటల్ ఖండించింది. 

జైపూర్: ‘నా తండ్రికి గుండె ఆపరేషన్ చేసి.. సర్జికల్ సిజర్లు లోపలే మరిచారు. అందుకే ఆపరేషన్ తర్వాత దినదినం ఆయన ఆరోగ్యం క్షీణించింది. 12 రోజులకు మరణించాడు. దహన సంస్కారాల తర్వాత అస్థికల కోసం వెళ్లగా ఆ బూడిదలో రెండు సర్జికల్ సిజర్లు లభించాయి. నా తండ్రి మరణానికి ఫోర్టిస్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యమే కారణం’ అని మరణించిన 74 ఏళ్ల ఉపేంద్ర శర్మ కొడుకు కమల్ ఆరోపించారు. కానీ, ఆ హాస్పిటల్ మాత్రం పై వ్యాఖ్యలను ఖండించింది. ఆ వ్యాఖ్యలు అవాస్తవాలని, కుట్రపూరితమైనవని కొట్టిపారేసింది.

జైపూర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌ పై ఈ ఆరోపణలు వచ్చాయి. మృతుడి కొడుకు జవహర్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మాన్సరోవర్ ఏరియాకు చెందిన ఉపేంద్ర శర్మ అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఫోర్టిస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మే 30న రాత్రి 8.30 గంటలకు అడ్మిట్ కాగా.. ఆపరేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తండ్రిని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజు అంటే మే 31వ తేదీన సాయంత్రం డిశ్చార్జీ చేశారు.

ఇంటికి తీసుకువచ్చిన రెండో రోజు నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైందని కొడుకు కమల్ ఆరోపించాడు. కానీ, అన్ని సర్దుకుంటాయని, కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా జూన్ 12వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉపేంద్ర శర్మ మరణించాడు.

తర్వాతి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. జూన్ 15వ తేదీ ఉదయం చితి వద్దకు వెళ్లి అస్థికలు తీసుకుంటూ ఉండగా.. ఒక జత కత్తెర్లు కనిపించాయి. తన తండ్రి చితిపై ఉంచిన డైరెక్షన్‌లోనే ఆ సిజర్లు కూడా ఉన్నాయని కమల్ చెబుతున్నాడు.

Also Read: మహిళల లోదుస్తులు దొంగిలించి హస్తప్రయోగం చేసుకుంటున్న సైకో.. వీడియో తీసి పోలీసులకు స్థానికుల ఫిర్యాదు

కాగా, కుటుంబ సభ్యుల ఆరోపణలు నిరాధారాలని ఫోర్టిస్ హాస్పిటల్ జోనల్ డైరెక్టర్ నీరవ్ బన్సాల్ కొట్టివేశారు. 

సర్జరీ తర్వాత కూడా తీసిన ఎక్స్ రే, ఇతర రిపోర్టులు ఉన్నాయని, అందులో సర్జికల్ సిజర్లు, లేదా ఏ ఇతర బయటి వస్తువులు లేవని స్పష్టమైందని ఆయన తెలిపారు. అలాంటి తప్పులు జరగకకుండా ఫోర్టిస్ హాస్పిటల్ కఠిన నిబందనలు పాటిస్తుందని వివరించారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై దర్యాప్తు చేసి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా ఓ కమిటీ ఏర్పాటు చేశారు.