రామాయణంపై పేరడీ నాటకం.. విద్యార్థులకు షాకిచ్చిన ఐఐటీ బాంబే
రామాయణంపై జోకులు వేస్తూ పేరడీ నాటకం వేసిన విద్యార్థులకు ఐఐటీ బాంబే షాకిచ్చింది. రాహోవన్ పేరిట విద్యార్థులు వేసిన నాటకం వివాదాస్పదం కావడంతో భారీగా జరిమానా విధించింది.
రాముడన్నా, రామాయణమన్నా భారతీయులకు ఎంతో గౌరవం. ప్రత్యేకించి హిందువులకు రామాయణం పరమ పవిత్రమైందన్న విశ్వాసం. అయితే, ప్రఖ్యాత ఐఐటీ బాంబే విద్యార్థులు కొందరు రామాయణంపై జోకులు పేలుస్తూ వేసిన పేరడీ నాటకం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎంతో పవిత్రంగా భావించే రామాయణాన్ని కామెడీ స్కిట్‌గా ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తక్షణమే చర్యలకు ఉపక్రమంచింది బాంబే ఐఐటీ విద్యా సంస్థ. స్కిట్ ప్రదర్శించిన ఎనిమిది విద్యార్థులకు భారీగా జరిమానా విధించింది.
ఈ ఏడాది మార్చి 31న ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఈ వేడుకలో కొందరు గ్రాడ్యుయేట్ విద్యార్థులు జూనియర్లతో కలిసి రాహోవన్ పేరుతో రామాయణం పేరడీ నాటకం వేశారు. ఈ నాటకాన్ని రికార్డు చేసి... సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రామాయణంలోని వనవాసం ఘట్టానికి సంబంధించి పేరడీ డైలాగ్‌లు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రాముడిని, రామాయణాన్ని కించపరుస్తూ... సంప్రదాయాన్ని మంటగలిపేలా విద్యార్థుల డైలాగ్‌లు ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంలోని రాముడు, సీతాదేవి, ఇతర పాత్రలతో సహా పూజ్యమైన హిందూ దేవతలను అవహేళన చేయడంపై వివాదం రేగింది.
దీంతో క్రమశిక్షణా చర్యలు చేపట్టిన ఐఐటీ బాంబే విద్యాసంస్థ.... విచారణ కమిటీని నియమించింది. విచారణ అనంతరం గ్రాడ్యుయేట్ సీనియర్ విద్యార్థులకు రూ.1.20 లక్షల చొప్పున, జూనియర్లకు రూ.40వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే, జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులుగా వారిని ప్రకటించింది. జరిమానా విధించడంతో పాటు హాస్టల్ సౌకర్యాలను వినియోగించుకోవడంపైనా నిషేధం విధించింది.