Asianet News TeluguAsianet News Telugu

Parliament Winter Session: పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా.. షెడ్యూల్‌ కంటే ఒక్క రోజు ముందే.. వివరాలు ఇవే

పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament Winter Session) ముగిశాయి. ఉభయ సభలు బుధవారం రోజున నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ శీతకాల సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 23న ముగియాల్సి ఉంది. అయితే, ఒక్క రోజు ముందుగానే బుధవారం సమావేశాలను ముగించారు. 

Parliament Winter Session both Houses adjourned sine die
Author
New Delhi, First Published Dec 22, 2021, 1:22 PM IST

పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament Winter Session) ముగిశాయి. ఉభయ సభలు బుధవారం రోజున నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ శీతకాల సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 23న ముగియాల్సి ఉంది. అయితే, ఒక్క రోజు ముందుగానే బుధవారం సమావేశాలను ముగించారు. సమావేశాలను ముగించే ముందు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla)  సభల పనితీరు గురించి మాట్లాడుతూ తమ ప్రకటనలను విడుదల చేశారు. శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పనితీరు అంచనాల కంటే తక్కువగా ఉందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ఏం తప్పు జరిగిందనేదానిపై అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నిబంధనలు, విధానాలు, పూర్వపరాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. 

ఇక, పార్లమెంట్‌ వర్షకాల సెషన్‌లో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వివిధ విపక్ష పార్టీలకు చెందిన 12 మంది సభ్యులను ఈ సెషన్ మొత్తానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన తెలిసిందే. ఈ క్రమంలోనే 12 ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశాయి. సభలో నిరసనలు తెలుపడంతోపాటుగా.. ప్రతిరోజూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.

Also Read: రాజ్యసభ ఛైర్మన్‌పైకి రూల్‌బుక్.. టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ శీతకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆందోళన కారణంగా వల్ల 18 గంటల 48 నిమిషాలకు పైగా సమయం వృథా అయిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులను చర్చించి ఆమోదించినట్లు ఓం బిర్లా పేర్కొన్నారు. సభలో ఓమిక్రాన్, వాతావరణ మార్పులు, ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో లోక్‌సభలో డిసెంబర్ 2వ తేదీన అత్యధికంగా 204 శాతం ఉత్పాదకత రికార్డు అయిందని తెలిపారు. ఇక, లోక్‌సభలో లఖింపూరీ ఖేరీ హింస ఘటనకు సంబంధించి సిట్‌ నివేదికపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. 

మొత్తంగా ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 82 శాతంగా, రాజ్యసభ ఉత్పాదకత 47 శాతంగా ఉందని పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇక, శీతకాల సమావేశాల్లో భాగంగా సాగు చట్టాల రద్దు బిల్లు (Farm Laws Repeal Act, 2021), ఓటర్ కార్డుతో ఆధార్ లింక్‌కు వీలు కల్పించే ఎన్నికల చట్టాల సవరణ బిల్లుతో (Election Laws (Amendment Bill) 2021) పాటు మరికొన్ని బిల్లులు పార్లమెంట్ ఉభయసభలలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios