Asianet News TeluguAsianet News Telugu

జీ20 సక్సెస్ 140 కోట్ల మంది భారతీయులది.. ఒక పార్టీదో, వర్గానిదో కాదు: పార్లమెంట్‌లో మోదీ

చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు.

Parliament special session Pm Modi in Lok sabha says G20 success is India success ksm
Author
First Published Sep 18, 2023, 11:53 AM IST | Last Updated Sep 18, 2023, 11:53 AM IST

చారిత్రక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్పూర్తినిస్తుందని పేర్కొన్నారు. 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు. 

ఈరోజు భారతీయులందరూ సాధించిన విజయాల గురించి ప్రతిచోటా చర్చ జరుగుతోందని మోదీ అన్నారు. ఇది మన పార్లమెంటు చరిత్రలో 75 సంవత్సరాలలో మనం చేసిన ఐక్య ప్రయత్నాల ఫలితమని చెప్పారు. చంద్రయాన్-3 విజయం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచం గర్వించేలా చేసిందని  చెప్పారు. 
చంద్రయాన్-3 విజయం ప్రపంచం మొత్తాన్ని సంబరాలు చేసుకునేలా చేసిందని అన్నారు. సాంకేతికత, విజ్ఞాన శాస్త్రం, మన శాస్త్రవేత్తల సామర్థ్యం, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల బలానికి అనుసంధానించబడిన భారతదేశ శక్తి కొత్త రూపాన్ని ఇది హైలైట్ చేసిందని చెప్పారు. ఈ రోజు తాను మన శాస్త్రవేత్తలను మళ్లీ అభినందించాలనుకుంటున్నానని తెలిపారు. 

సమిష్టి కృషి వల్లే జీ20 సదస్సు విజయవంతం అయిందని అన్నారు. ఇది దేశ ప్రజల విజయమని పేర్కొన్నారు. జీ 20 విజయం 140 కోట్ల మంది భారతీయులదని అన్నారు. జీ20 విజయం ఒక పార్టీదో, ఒక వర్గానిదో కాదని చెప్పారు. జీ20లో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన వందల సమావేశాలకు అనేకగ నగరాలు వేదికగా  నిలిచాయని గుర్తుచేశారు. జీ20 సమావేశ నిర్వహణ భారత ప్రతిష్టను మరింతగా  పెంచిందని చెప్పారు. ప్రతి దేశం భారత సామర్థ్యాన్ని, నిర్వహణ తీరును ప్రశంసించాయని తెలిపారు. జీ20లోకి ఆఫ్రికా యూనియన్‌ను తీసుకోవడం చారిత్రక ఘట్టం అని అన్నారు. నేడు ప్రపంచానికి భారత్ మిత్ర దేశంగా రూపొందిందని చెప్పారు. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios