Central government: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 24 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సమావేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తడానికి సిద్ధమయ్యాయి.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూలై 18 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పలు బిల్లులను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు దేశంలో నెలకొన్న పలు ఘోర పరిస్థితులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేవనెత్తడానికి సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నందున ఈ వర్షాకాల సమావేశాలకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.
24 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా 24 బిల్లులను ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాబితా చేసిన బిల్లులలో కొన్ని ఇతర బిల్లులు ఇలా ఉన్నాయి.. ది కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు, ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్‌ల అభివృద్ధి బిల్లు, ఇది ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం- 2005కి సంబంధించినది. ఇది దాని ఫ్రేమ్ నియమాలను సవరించాలని ప్రతిపాదిస్తుంది. వస్తువుల భౌగోళిక సూచనలు (రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ) (సవరణ) బిల్లు, గిడ్డంగుల (అభివృద్ధి అండ్ నియంత్రణ) (సవరణ) బిల్లు, the Competition (Amendment) Bill లు ఉన్నాయి. మొత్తం 24 బిల్లులతో పాటు మరో ఎనిమిది బిల్లులు ఇప్పటికే ఉభయ సభల ముందు పెండింగ్‌లో ఉన్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నికలు
ఈ వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో రాష్ట్రపతి, ఉపాధ్యక్షులను కూడా ఎన్నుకోనున్నారు. సెషన్‌లో మొదటి రోజు పార్లమెంట్‌లోని పోలింగ్ బూత్‌లలో ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయనున్నారు. జూలై 21న పార్లమెంట్ హౌస్‌లో ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థులుగా ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు అధికార, విపక్షాల భేటీ
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం ఉదయం పార్లమెంటు అనెక్స్ భవనంలో అన్ని పార్టీల సమావేశానికి పిలిచింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా పాల్గొనే అవకాశం ఉంది. రానున్న వర్షాకాల సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ఆదివారం కూడా సమావేశం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై చర్చించేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి కూడా ఆహ్వానం అందింది.
బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేలా..
పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ వంటి సమస్యలను లేవనెత్తడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ జాబితాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధరలు, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, డాలర్‌తో రూపాయి పతనం వంటి అంశాలు ఉన్నాయి. వ్యూహంపై చర్చించేందుకు, సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం నాడు సమావేశమైన సంగతి తెలిసిందే.
ఎల్‌పీజీ సిలిండర్ రేటు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రూపాయి పతనం, అగ్నిపథ్ పథకం, సైనిక సామర్థ్యం బలహీనపడటం, తూర్పు లడఖ్‌లో చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తత, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రజాస్వామ్యంపై దాడి చేయడం వంటి అంశాలను ఉభయ సభల్లో లేవనెత్తుతామని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి.
