మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇవాళ లోక్ సభ, రాజ్యసభలో ఈ విషయమై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాయిదా తీర్మాణ నోటీసులు ఇచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై చర్చకు వాయిదా తీర్మాణాలను ఇచ్చాయి విపక్షాలు. నిన్న కూడ మణిపూర్ అంశంపై విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. దీంతో రెండు దఫాలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి.
ఇవాళ కూడ పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నాయి. మణిపూర్ లో హింసపై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై లోక్ సభలో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కూడ మణిపూర్ అంశంపై చర్చకు వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.
మణిపూర్ అంశంపై చర్చకు సిద్దంగా ఉన్నామని కేంద్రం కూడ తెలిపింది. నిన్న రాజ్య సభలో స్వల్పకాలిక చర్చకు కేంద్రం సిద్దమని తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.ఈ విషయమై విపక్షాలు నిరసనకు దిగడంతో రాజ్యసభ వాయిదా పడింది. లోక్ సభలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ కూడ వాయిదా పడింది. మణిపూర్ లో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది.
