సారాంశం

మణిపూర్ హింసపై  లోక్ సభలో విపక్షాలు ఆందోళనతో గందరగోళ వాతావరణం నెలకొంది.  ఇవాళ సభ ప్రారంభమైన నాటి నుండి  వాయిదాలు పడింది. దీంతో  లోక్ సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై  విపక్షాల ఆందోళనల నేపథ్యంలో   లోక్ సభను  మంగళవారానికి వాయిదా వేశారు  స్పీకర్  ఓంబిర్లా.మణిపూర్ హింసపై  చర్చకు  విపక్షాలు  సోమవారం నాడు పార్లమెంట్ ఉభయ సభల్లో  నిరసనకు దిగారు. లోక్ సభ ప్రారంభం కాగానే   మణిపూర్ అంశంపై  విపక్షాలు పట్టుబట్టాయి. ఇవాళ  సభ ప్రారంభం కాగానే  ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు.

ఇవాళ మధ్యాహ్నం  12 గంటలకు  మణిపూర్ అంశంపై చర్చకు  ప్రభుత్వం సిద్దంగా ఉందని  కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్  ప్రకటించారు.  అయితే  ప్రధాని  ఈ విషయమై  లోక్ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్  చేశాయి. ఇదే డిమాండ్ తో  విపక్షాలు  లోక్ సభలో నిరసనకు దిగాయి. దీంతో  సభను మధ్యాహ్నం 12 గంటల వరకు  స్పీకర్  వాయిదా వేశారు.  సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ ఇదే పరిస్థితి నెలకొంది.  ఈ పరిణామాలతో  లోక్ సభను రెండు గంటలకు వాయిదా వేశారు  స్పీకర్ ఓం బిర్లా.  రెండు గంటలకు  సభ ప్రారంభమైన తర్వాత  కూడ విపక్షాలు నిరసనకు దిగాయి.  

ఇవాళ మధ్యాహ్నం లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.  మణిపూర్ అంశంపై  చర్చకు  ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.ఈ అంశంపై  చర్చలో పాల్గొనాలని ఆయన  విపక్షాలను  కోరారు. మణిపూర్ హింసపై  వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

మంత్రి అమిత్ షా  ప్రకటనతో   విపక్షాలు తృప్తి చెందలేదు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ విపక్షాలు తమ పట్టును వీడలేదు. విపక్షాలు  నిరసనకు దిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో  లోక్ సభను   రేపటికి వాయిదా వేశారు  స్పీకర్ ఓం బిర్లా.