Asianet News TeluguAsianet News Telugu

దేశంలో 4 లక్షలకు పైగా పెండింగ్ లో అండర్ ట్రయల్ ఖైదీల కేసులు

New Delhi: ఖైదీల కోసం జైలులో లీగల్ సర్వీసెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. దీంతో ఖైదీలకు ఎప్పటికప్పుడు న్యాయసహాయం, సలహాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
 

Parliament Budget Session: More than 4 lakh cases of undertrial prisoners pending in the country
Author
First Published Feb 9, 2023, 2:00 PM IST

Undertrial Cases In India: దేశంలో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల‌పై ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రాన్ని కూడా నొక్కి చెప్పాయి. తాజాగా దేశంలో అండ‌ర్ ఖైదీల కేసులు వివ‌రాలు ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ కు వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ఖైదీల కోసం జైలులో లీగల్ సర్వీసెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. దీంతో ఖైదీలకు ఎప్పటికప్పుడు న్యాయసహాయం, సలహాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా అండ‌ర్ ట్రయ‌ల్ ఖైదీల కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 4 లక్షలకు పైగా అండర్ ట్రయల్ ఖైదీల కేసులు పెండింగ్ లో ఉన్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలను పార్లమెంటులో ఉటంకిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 8) తెలిపింది. ఖైదీల పరిపాలన, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అనీ, అండర్ ట్రయల్ ఖైదీల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అన్నారు. 

దేశంలో విచారణ ఖైదీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటుందా? అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫౌజియా ఖాన్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ తోడ్పాటునందిస్తోందని మంత్రి తెలిపారు. విచారణ ఖైదీని బెయిల్ పై విడుదల చేసేందుకు వీలు కల్పించే సెక్షన్ 436ఏను కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ)లో చేర్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇది ఒక నేరానికి ఏదైనా చ‌ట్టం ప్ర‌కారం నిర్దేశించబడిన గరిష్ట కాల వ్యవధిలో సగం వరకు నిర్బంధంలో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదల చేయడానికి సూచ‌న‌లు అందిస్తుంద‌ని మంత్రి తెలిపారు.

ఖైదీల సంక్షేమాన్ని అర్థం చేసుకోవడానికి గైడ్ గా ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోడల్ ప్రిజన్ మాన్యువల్ ను పంపిణీ చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయిన అజ‌య్ మిశ్రా తెలిపారు. జైళ్ల మాన్యువల్ ను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

'జైళ్లలో లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ ఏర్పాటు'

అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలు జైళ్లలో లీగల్ సర్వీసెస్ క్లినిక్లను ఏర్పాటు చేశాయి. ఈ క్లినిక్ లను ఎంపానెల్డ్ లీగల్ సర్వీస్ న్యాయవాదులు-శిక్షణ పొందిన పారా-లీగల్ వాలంటీర్లు నిర్వహిస్తారు. జైళ్లలో ఇలాంటి క్లినిక్ లను ఏర్పాటు చేసి ఏ ఖైదీని నిర్లక్ష్యం చేయ‌కుండా వారికి న్యాయ సహాయం, సలహాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య‌లు.. 

శిక్ష, బెయిల్ మొత్తాలను భరించలేని పేద అండర్ ట్రయల్ ఖైదీలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. జైళ్లలో ఉండి, జరిమానా, బెయిల్ మొత్తాన్ని భరించలేని నిరుపేదలకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసులకు ప్రాధాన్యమివ్వాలని, మానవ సున్నితత్వం ఆధారంగా చట్టప్రకారం వారిని విడుదల చేయాలని గత ఏడాది ఇక్కడ జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన విష‌యాన్ని సైతం గుర్తు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios