Asianet News TeluguAsianet News Telugu

వివాదాస్పదంగా మారిన పరేష్ రావల్ ‘చేపల కూర’ కామెంట్స్.. సారీ చెప్పిన నటుడు...

బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ వివాదాల్లో చిక్కుకున్నారు. బెంగాలీలకు చేపలకూర వండి పెడతారా.. అంటూ చేసిన వ్యాఖ్యల మీద క్షమాపణలు చెప్పారు. 

Paresh Rawal apologises to bengalis for 'fish curry' remarks
Author
First Published Dec 3, 2022, 8:21 AM IST

గుజరాత్ :  గుజరాత్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమకు అనువుగా ప్రచారం చేసుకుంటున్నాయి. తమ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బాలీవుడ్లో మంచి నటుడుగా పేరున్న పరేష్ రావల్ బిజెపిలో చేరి, ఎంపీగా  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా చేసిన ‘చేపల కూర’ కామెంట్స్ విమర్శకులకు పని చెప్పింది. దీనిమీద తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలపై పరేష్ రావల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. 

అసలు ఏమైందంటే..
‘చేపల కూర’కు సంబంధించి గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఆయన ధరల పెరుగుదల పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా.. ‘ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కానీ కొన్ని రోజులకు వాటి ధరలు దిగొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ.అప్పటికే ఢిల్లీలో జరుగుతున్నట్లుగా  బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మీ చుట్టూ చేరితే ఏం చేస్తారు. అప్పుడిక గ్యాస్ సిలిండర్ లతో మీరేం చేసుకుంటారు?  బెంగాలీలకు ‘చేపల కూర’ వండి పెడతారా?’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. గుజరాతీలు ధరల పెరుగుదలను భరించగలరు. కానీ, ఇలాంటి పరిస్థితులను ఏ మాత్రం సహించలేరు అంటూ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు నేతలు ప్రైవేటు విమానాల్లో వచ్చి.. ఇక్కడ దిగిన తరువాత.. రిక్షాల్లో తిరుగుతూ ప్రజలకు షో చేస్తుంటారని.. కేజ్రీవాల్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్.. చేరిన రోజే కీలకపదవి...

 పరేశ్ రావల్ పై కేసు..
బిజెపి ఎంపీ నటుడు పరేష్ రావల్ చేసిన వ్యాఖ్యలు బెంగాలీ లను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బెంగాల్ లో ఆయన సినిమాలు బ్యాన్ చేయాలనేంతవరకు నిరసనలు వ్యక్తమయ్యాయి. పరేష్ రావెల్ వ్యాఖ్యలపై  తృణమూల్ ఎంపీ కీర్తి ఆజాద్ విరుచుకుపడ్డారు. బిఎస్ఎఫ్,  హోమ్ మంత్రిత్వ శాఖ సరిగా పని చేయకపోవడం వల్లే  రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు భారత్ లోకి ప్రవేశిస్తున్నారని ఆయన చెప్పాలనుకుంటున్నారా.. అంటూ విమర్శించారు. ఇక సిపిఎం దీనిమీద స్పందిస్తూ..  పరేష్రావల్ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. 

కోల్కతాలోని తారాటోలా పోలీస్ స్టేషన్లో పరేష్ రావెల్ పై  సిపిఎం ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు బెంగాలీలను అవమానించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు సిపిఎం పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పరేష్ రావెల్  చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కాదు..  అల్లర్లను ప్రేరేపించేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బెంగాలీలు ఇతర వర్గాల మధ్య సామరస్యాన్ని  దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

తన వ్యాఖ్యలు  ఇంత దుమారానికి దారితీస్తాయని ఊహించని   పరేష్ రావల్  దీనిమీద స్పందించారు.  బెంగాలీ అంటే తన ఉద్దేశం బంగ్లాదేశ్, రొహంగ్యాలు అని అర్థం అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరిమనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios