రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసులో గంట గంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్.. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

అయితే సీఎం ఉద్దవ్ థాక్రేకు పరమ్ వీర్ సింగ్ రాసిన లేఖపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఆ లేఖపై పరమ్‌వీర్‌ సంతకం లేకపోవడంతో తొలుత చాలా మంది అనుమానించారు. ఈ క్రమంలో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు ముంబై మాజీ సీపీ.

ఆ లేఖను సీఎంకు తానే రాసినట్లు ఆయన అంగీకరించారు. త్వరలోనే తన సంతకంతో ఉన్న కాపీని సీఎంవోకు పంపుతానన్న ఆయన.. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉంటానని పరమ్ వీర్ తెలిపారు.   

Also Read:అంబానీ ఇంటి వద్ద కలకలం: స్కార్పియో ఓనర్ మరణం.. సచిన్ వాజే అనుచరుడు అరెస్ట్

పరమ్‌బీర్‌ రాసిన లేఖలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.100 కోట్లను వసూలు చేయాల్సిందిగా సచిన్ వాజేపై అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చారని పరమ్ వీర్ ఆరోపించారు.

వీటిల్లో దాదాపు 60 కోట్ల వరకు ముంబయిలోని పబ్‌లు, రెస్టారెంట్ల నుంచి వసూలు చేసి.. ఇతర మార్గాల్లో మిగిలిన మొత్తం వసూలు చేయాలని సూచించినట్లు మాజీ కొత్వాల్ ఆరోపించారు.

ఈ విషయాన్ని తాను సీఎం ఉద్దవ్ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌లకు వివరించినట్లు పేర్కొన్నారు. అయితే తనపై పరమ్ వీర్ చేసిన ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని అనిల్ హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆ లేఖ పరమ్‌బీర్‌ సింగ్‌ సంతకంతో కానీ, అధికారిక ఈ మెయిల్‌ నుంచి కానీ రాలేదని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.