రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుదు పదార్ధాలు నింపిన స్కార్పియో కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటికే ఆ కారు ఓనర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు

రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుదు పదార్ధాలు నింపిన స్కార్పియో కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటికే ఆ కారు ఓనర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

ఆ తర్వాత ముంబై ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సచిన్ వాజేను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత ముంబై నగర పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్‌పై ప్రభుత్వం బదిలీ వేసింది.

ఇదే సమయంలో నిన్న రాత్రి పరమ్ వీర్ సింగ్‌.. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సచిన్ వాజేతో కలిసి గతంలో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ను, ఒక బుకీని పోలీసులు అరెస్టు చేశారు.

స్కార్పియో ఓనర్ మనసుఖ్‌ హిరేన్‌ హత్య కేసులో వీరిని అదుపులోకి తీసుకొన్నట్లు మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం.. మన్‌సుఖ్‌ హత్య కేసు దర్యాప్తు కూడా ఎన్‌ఐఏకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఈ కేసును విచారించిన ఏటీస్‌ అధికారులు దర్యాప్తు వివరాలను ఎన్‌ఐఏకు అప్పగించనున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం సస్పెన్షన్‌లో ఉన్న ముంబయి పోలీస్‌ కానిస్టేబుల్‌ వినాయక్‌ షిండే (55), బుకీ నరేష్‌ ధార్‌ను ఏటీఎస్‌ బృందం అదుపులోకి తీసుకొంది. వీరిలో వినాయక్‌ షిండే ముంబయి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ప్రదీప్‌ శర్మ బృందంలో విధులు నిర్వర్తించారు.

అదే బృందంలో సచిన్‌ వాజే కూడా పనిచేశారు. 2006లో ఛోటా రాజన్‌ అనుచరుడు లఖన్‌ భయ్యా (రామ్‌నారాయణ్‌ గుప్తా) ఎన్‌కౌంటర్‌ కేసులో వినాయక్‌ సస్పెండ్‌ అయ్యాడు. 2013లో సెషన్స్‌ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించగా... ప్రస్తుతం వినాయక్ పెరోల్‌పై బయట ఉన్నాడు.