అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మద్రాస్ హైకోర్టు అనర్హత వేటును సమర్ధిస్తూ అనర్హులుగా తీర్పు వెలువరించడంతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినా దినదిన గండంగా మారే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కేంద్రంగా రాజకీయాలు జరగనున్నాయి. 

18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ధన్ పాల్ విధించిన అనర్హత వేటును మద్రాస్‌ హైకోర్టు సమర్థించింది. వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో ఆరు నెలల్లో ఉపఎన్నికలు అనివార్యమైంది.

ప్రస్తుతం తమిళనాడు శాసనసభ్యుల సంఖ్య 234. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పుతో 18 మందిపై వేటు పడగా ఆ సంఖ్య 215కు తగ్గింది. వీరిలో ఇద్దరు మరణించడంతో ఆ సంఖ్య 213కు చేరింది. తమిళనాడులో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 213కు పడిపోయింది. వీరిలో పళని స్వామి ప్రభుత్వానికి  స్పీకర్ తో కలుపుకుని 111 మంది సభ్యుల బలం ఉంది. ప్రస్తుత శాసన సభ్యుల ప్రకారం మ్యాజిక్ ఫిగర్ 117. అయితే ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు.  

ఇకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఇద్దరు ఎమ్మెల్యేల మరణంతో మెుత్తం 20 అసెంబ్లీ స్థానాలకు తమిళనాడులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  

ఇకపోతే రాబోయే ఎన్నికలపై సీఎం ఎడప్పాడి పళని స్వామి రెడీ అయ్యారు. తీర్పును ముందుగానే ఊహించిన సీఎం రాబోయే ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ పళని స్వామి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. 

అయితే పళని స్వామి హస్తిన ప్రయాణం వెనుక రాజకీయకారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మద్రాస్ హైకోర్టు తీర్పు, ఉపఎన్నికలు వంటి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించే అవకాశం ఉంది. అయితే నిధులు పేరుతో ఢిల్లీలో రాజకీయం చేయనున్నట్లు సమాచారం.

ఇకపోతే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల భవితవ్యంపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు తీర్పుతో షాక్ లో ఉన్న దినకరన్ భవిష్యత్ కార్యచరణపై శుక్రవారం వేటుపడిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల నిర్ణయమే తన నిర్ణయమంటూ దినకరన్ చెప్తున్నారు.  

మద్రాస్ హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపిన దినకరన్ తీర్పును ఊహించలేదని దినకరన్ తెలిపారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించినట్లు తెలిపారు. హైకోర్టు తీర్పుతో టీటీవీ దినకరన్ కు రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం లేదా ఎన్నికలకు సిద్దమవ్వడం.  

ఈ రెండే దినకరన్ ముందుకు కనిపిస్తున్న దారులు. అయితే దినకరన్ ఏం చేస్తారన్నది వ్యూహం శుక్రవారం తేలనుంది. అయితే దినకరన్ పళని స్వామి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలలో వందమంది తనతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ ఉపఎన్నికలు అనివార్యమైతే 20 స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది పళని స్వామి ప్రభుత్వాన్ని గద్దె దించుతానని సన్నిహితుల వద్ద పళని స్వామి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

అయితే అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ గుర్తుపై గెలుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 18 మంది ఎమ్మెల్యేలు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ తరపున పోటీ చేస్తారా లేక స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేస్తారా అన్నది సస్పెన్ మారింది. 

మరోవైపు ఎడప్పాడి పళని స్వామి ప్రభుత్వానికి మరో ఆరు నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేనట్లుగా తెలుస్తోంది. అయితే ఆరు నెలల తర్వాత మాత్రం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. టీటీవీ దినకరణ్ ఎన్నికలకు వెళ్తే గడ్డు పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. 20 మంది స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే పార్టీలో దినకరన్ చీలిక తెచ్చే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. 

ఒకవేళ ఇప్పటికే అసెంబ్లీలో కాంగ్రెస్ తో కలుపుకుని డీఎంకే పార్టీ సభ్యుల సంఖ్య97. అయితే టీటీవీ దినకరణ్ కు డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ మద్దతు పలుకుతూ ఉపఎన్నికలకు వెళ్తే పళని స్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ సుప్రీం కోర్టు తీర్పును ఆశ్రయించకుండా ఎన్నికలకు వెళ్తే. 

ఒకవేళ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు టీటీవీ దినకరణ్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన ముప్పు తప్పదని రాజకీయ వర్గాల విశ్లేషణ. 18 మంది ఎమ్మెల్యేలు తాను కలుపుకుంటే మెుత్తం 19 మంది ఎమ్మెల్యేల బలంతో డీఎంకేతో చర్చలు జరిపినా ఈపీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అయితే టీటీవీ దినకరణ్ ఎలా వ్యవహరిస్తారో అన్నది మాత్రం కీలకంగా మారింది. 
 
అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలన్న ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.

18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా... స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో కేసును మూడో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ్ కు బదిలీ చేశారు. ఈ కేసును విచారించి అనర్హత వేటును సమర్థించారు. దీంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది.

ఈ వార్తలు కూడా చదవండి

టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ: పళని స్వామి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్

ప్రజాస్వామ్య విజయం, ఎన్నికలకు రెడీ: పళనిస్వామి