Pahalgam Terrorist Attack: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇండియాతో యుద్దానికి సిద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారతదేశం దాడి చేస్తే ధీటుగా రియాక్ట్ అవుతామని అన్నారు.

Pahalgam Terrorist Attack: పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదాన్ని సమర్ధించిందని... కానీ ఇప్పుడు తమ తప్పు తెలుసుకుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. అయినా ఇండియా తాము ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్లు ఆరోపించడం తగదన్నారు. భారత్ చర్యలతో యావత్ ప్రపంచం భారత్-పాక్ యుద్ధం గురించి ఆందోళన చెందుతోందన్నారు. భారత్ దాడికి దిగితే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉందని... భారత్ వైమానిక దాడి చేస్తే తగిన రియాక్షన్ ఉంటుందంటూ పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు.

 పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నారంటే?

పహల్గాం దాడి, ఆ తర్వాత భారత చర్యలపై ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ... “ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఊహించినదే. పహల్గాంలో జరిగిందానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు... ఉద్రిక్తతలు పెంచడానికే ఇదంతా” అని అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రదాడిని ఖండించిందని ఆయన అన్నారు.

“మా ప్రభుత్వం పహల్గాం దాడిని ఖండించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలి. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలు. 80ల నాటి ఆఫ్ఘన్ యుద్ధం నుంచి ఇప్పటి వరకు, ప్రపంచంలో ఏ దేశం అనుభవించనంత ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అనుభవించింది. ఉగ్రదాడులు ఎంత బాధ కలిగిస్తాయో మాకు తెలుసు” అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు.

పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆయన ఖండించారు. దాడి వెనుక ఉన్నట్లు చెబుతున్న సంస్థ ఉనికిలో లేదని అన్నారు. “ఈ దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్న సంస్థ పేరు మేము ఎప్పుడూ వినలేదు. లష్కరే తొయిబా పాత సంస్థ, ఇప్పుడు అది లేదు” అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు.

ఉగ్రవాద సంస్థలకు నిధులపై కామెంట్స్

పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు నిధులు, సహాయం, శిక్షణ ఇస్తోందన్న ఆరోపణలపై ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ... “పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం చాలా తేలిక. ఈ ప్రాంతంలో ఏదైనా జరిగితే పాకిస్తాన్‌పై నింద వేస్తారు. ఈరోజు పేర్కొంటున్న ఉగ్రవాద సంస్థలు గతంలో అమెరికాతో కలిసి పనిచేసేవి. అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్‌లో అలాంటి సంస్థలు లేవు” అని ఖ్వాాజా ఆసిఫ్ అన్నారు.

భారత్ దాడి చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఖ్వాజా ఆసిఫ్ స్పందిస్తూ... “ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. పుల్వామా దాడి కూడా కల్పితమే. భారత మీడియాలో కూడా అలాంటి వార్తలే వచ్చాయి. పుల్వామాలో పాకిస్తాన్ పాత్ర లేదు. అప్పుడు మేం భారత విమానాన్ని కూల్చాం. మంచి మనసుతో భారత పైలట్‌ను విడుదల చేశాం. ఇప్పుడు జరిగిన దాడి భారత్ ఆధీనంలోని కశ్మీర్‌లో జరిగింది. వాళ్లు మాపై నింద వేస్తున్నారు. ఎవరూ వినని సంస్థ పేరు చెబుతున్నారు” అని అన్నారు.

“మేం ఆందోళన చెందడం లేదు. యుద్ధం వస్తే, భారత్ దాడి చేస్తే మేం ప్రతిఘటిస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది” అని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. పుల్వామా దాడికి భారతే కారణమని ఆయన ఆరోపించారు. “కశ్మీర్‌లో జరిగిన దాడికి భారతే కారణం. వాళ్లే ఈ పరిస్థితిని సృష్టించారు” అని ఆయన అన్నారు.