మరో కార్గిల్ వార్ తప్పదా..? ఆల్రెడీ పాక్ ఆర్మీ భారత్ లోకి ఎంట్రీ...
పాకిస్థాన్ మన దేశంలో భారీ హింసకు సిద్దమవుతోందట. ఇంతకాలం ఉగ్రవాదులతో ఈ పని చేయించిన పాక్ ఇప్పుడు స్వయంగా ఆర్మీని రంగంలోకి దింపిందనే ప్రచారం ఆందోళనకరం.
భారతదేశంపై భారీ కుట్రకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందా..? కార్గిల్ తరహాలో మరో యుద్దానికి సిద్దమవుతోందా..? జమ్మూ కాశ్మీర్ లో భారీ రక్తపాతానికి పాక్ సన్నహాలు చేస్తోందా..? అంటే అవుననే అంటున్నారు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మానవహక్కుల కార్యకర్త అమ్జద్ ఆయూబ్ మీర్జా..
ఇంతకాలం భారత్ పై దాడికి ఉగ్రవాదులను ఉపయోగించిన పాక్ ఇప్పుడు స్వయంగా ఆ దేశ ఆర్మీని రంగంలోకి దింపుతోందని ఆయూబ్ ఆందోళన వ్యక్తం చేసారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జి) కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ ఆదిల్ రహ్మనీ ఆధ్వర్యంలో భారత్ పై దాడులకు కుట్రలు జరుగుతున్నాయట. ఇప్పటికే 500 నుండి 600 మందితో కూడిన బెటాలియన్ ఇండియాలోకి అక్రమంగా చొరబడినట్లు ఆయూబ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
గతంలో ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా చొరబడే మార్గంలోనే తాజాగా పాక్ సైన్యం చొరబడినట్లు ఆయూబ్ తెలిపారు. ప్రస్తుతం వీళ్లంతా జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా ప్రాంతంలో తలదాచుకున్నారని... వీరికి స్థానికంగా వుండే ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ సహకారం అందిస్తున్నారని తెలిపారు. భారత్ లో చొరబడ్డ బెటాలియన్ కు లెప్టినెంట్ కల్నల్ షాహిద్ సలీమ్ నేతృత్వం వహిస్తున్నారని అమ్జద్ ఆయూబ్ మీర్జా తెలిపారు.
మరింత ఆందోళనకర విషయం ఏమిటంటే భారత్ లో చొరబాటుకు మరో రెండు బెటాలియన్లు ముజఫరాబాద్ లో సిద్దంగా వున్నాయట. వారికి ఆదేశాలు అందింనవెంటనే భారత్ లోకి ప్రవేశించడానికి సిద్దంగా వున్నారట. ఇలా వేలాది సైన్యంతో భారత సైన్యంపై ఆకస్మిక దాడులకు తెగబడాలన్నదే పాక్ కుట్రగా ఆయూబ్ పేర్కొన్నారు. కాబట్టి భారత సైన్యం కౌంటర్ ఎటాక్ కు సిద్దంగా వుండాలని అమ్జద్ ఆయూబ్ ఖాన్ సూచించారు.