రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఇప్పటి వరకు ఉచితంగా 25 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.3 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మరో 3 లక్షలపైగా టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. మే1న వ్యాక్సినేషన్‌ మూడో దశ ప్రారంభం కాగా, జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మొత్తం ఉత్పత్తిలో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తామని ప్రధాని వెల్లడించారు. 

ప్రధాని నిర్ణయం మేరకు 44 కోట్ల డోసులకు పైగా ఆర్డర్‌ చేసినట్టు కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల కోసం మంగళవారం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 25 కోట్లు, భారత్‌ బయోటెక్‌‌కు 19 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చింది. మొత్తంగా ఈ 44 కోట్ల టీకా డోసులు డిసెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30 శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు వెల్లడించింది.   

Also Read:పాడైన ఫ్రిజ్ లో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు..! గడ్డకట్టి పనికిరాకుండా పోయిన వైనం..!!

మరోవైపు, కార్బివాక్స్‌ టీకా 30 కోట్ల డోసుల కోసం బయోలాజికల్‌ -ఇ సంస్థకు ఆర్డర్‌ ఇచ్చామని.. ఇది సెప్టెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తుందని నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.19 కోట్ల టీకా డోసులు పంపిణీకి సిద్ధంగా వున్నాయి. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేయగా.. వీటిలో 23.47 కోట్ల డోసులు వినియోగం (వృథాతో కలిపి) జరిగినట్టు తెలిపింది.