వ్యాక్సిన్ కొరతతో ప్రజలు అల్లాడిపోతుంటే.. అధికారుల నిర్లక్ష్యం వల్ల 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైపోయిన విచారకరమైన ఘటన జైపూర్ లో జరిగింది. వ్యాక్సిన్ల నిల్వకోసం పాడైపోయిన ఫ్రిడ్జ్ ను వాడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో జరగిన ఈ ఘటన స్తానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. గ్రామంలోని పీహెచ్ సీలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. వాటిని  పీహెచ్ సీలో ఉన్న ఫ్రిడ్జ్ లో భద్రపరిచారు. అయితే మే 22 నుంచి ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. 

ఈ విషయాన్ని సిబ్బంది, అధికారులు ఎవ్వరూ గుర్తించలేదు. పట్టించుకోలేదు. దీంతో 480 వ్యాక్సిన్లు గడ్డకట్టి పాడైపోయాయి. ఈ విషయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దృష్టికి వెళ్లింది. 

చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మహేంద్ర పర్మర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం పీహెచ్ సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. ఫ్రిజ్ పాడైపోవడంతో అవి గడ్డకట్టి వ్యర్థంగా మారాయని.. దీనికి కారణమైన పీహెచ్ సీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని సీఎమ్‌హెచ్‌వో మహేంద్ర పర్మర్ తెలిపారు. 

పీహెచ్ సీ డాక్టర్ రామచంద్ర శర్మ మాట్లాడుతూ.. ‘480 పైగా కొవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైనట్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఫ్రిజ్ పాడైన మాట వాస్తవమే.. కానీ వెంటనే మెకానిక్ ను పిలిపించి ఫ్రిజ్ ను బాగు చేయించాం. మా దగ్గర ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్లు లేవు. గడ్డకట్టినవి అన్ని ఇతర వ్యాక్సిన్లు.. దీనిమీద ఇప్పటికే ఎంక్వైరీకి వచ్చిన మెడికల్ టీమ్ కు వివరణ ఇచ్చాం’ అని చెప్పుకొచ్చాడు.