Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. ల‌క్ష‌ల మంది ప్రాణాలు తీసుకోగా.. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. అయితే, క‌రోనా క‌ల్లోలం కారణంగా భార‌త్ లో 1.9 మిలియ‌న్ల మంది పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను లేదా సంర‌క్ష‌కుల‌ను కోల్పోయార‌ని ప్ర‌ముఖ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ "ది లాన్సెట్" పేర్కొంది.  

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. ల‌క్ష‌ల మంది ప్రాణాలు తీసుకోగా.. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. ఇప్పటికీ చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంది. అయితే, క‌రోనా క‌ల్లోలం కారణంగా భార‌త్ లో 1.9 మిలియ‌న్ల మంది పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను లేదా సంర‌క్ష‌కుల‌ను కోల్పోయార‌ని ప్ర‌ముఖ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ది లాన్సెట్ పేర్కొంది. ఇలా త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల‌ను కోల్పోన వారిలో చిన్న పిల్ల‌ల కంటే కౌమార‌ద‌శ‌లో ఉన్న వారు అధికంగా ఉన్నార‌ని ఈ నివేదిక పేర్కొంది. ది లాన్సెట్ చైల్డ్ & అడోలసెంట్ హెల్త్ జర్నల్ లో ప్ర‌చురించిబ‌డిన నివేదిక వివ‌రాల ప్ర‌కారం.. క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న మొత్తం 20 దేశాల అంశాల‌ను ఇందులో ప్ర‌స్తావించారు. ప్రపంచవ్యాప్తంగా, COVID-19 ఫలితంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుని మరణాన్ని అనుభవించినట్లు అంచనా వేయబడిన పిల్లల సంఖ్య 5.2 మిలియన్లకు పైగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు. కోవిడ్-19- కారణంగా అనాథలైన.. సంరక్షకుని మరణాల బారిన పడిన పిల్లల సంఖ్య క‌రోనా మహమ్మారి మొదటి 14 నెలల తర్వాత సంఖ్యలతో పోలిస్తే.. గ‌తేడాది మే 1 నుంచి అక్టోబర్ 31వ‌ర‌కు అంటే ఈ ఆరు నెల‌ల్లో దాదాపు రెట్టింపు అయినట్లు ఈ నివేదిక పేర్కొంది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా COVID-19 కార‌ణంగా అనాథలైన ముగ్గురు పిల్లలలో ఇద్దరు 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న పిల్ల‌లు ఉన్నారు. అనాథ‌లు, సంర‌క్షులు లేని వారి అంచ‌నాలు త‌క్కువ‌గానే అంచ‌నా వేయ‌బ‌డుతున్నాయ‌ని తెలిపింది. మ‌రింత డేటా అందుబాటులోకి వ‌స్తే ఈ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని లాన్సెట్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురిత‌మైన నివేదిక పేర్కొంది. "రియల్-టైమ్ అప్‌డేట్ చేయబడిన డేటా జనవరి 2022 నాటికి లెక్క‌లు గ‌మ‌నిస్తే.. క‌రోనాతో అనాథ‌మైన పిల్ల‌ల సంఖ్య 6.7 మిలియన్లకు చేరుకుంద‌ని సూచిస్తున్న‌ద‌ని తెలిపింది. ప్ర‌స్తుత అంచ‌నాలు అక్టోబ‌ర్ 1 నాటి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితుల‌పై ఉన్నాయ‌ని ఇందులో భాగమైన ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంద‌ని తెలిపారు. దీని కార‌ణంగా అనాథ‌ల‌వుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంద‌ని తెలిపారు. 

ఈ అధ్య‌య‌నం కొన‌సాగిన 20 దేశాలలో ప్రభావితమైన పిల్లల సంఖ్య జర్మనీలో 2,400 ఉండ‌గా, అత్య‌ధికంగా భార‌త్ లో 1.9 మిలియన్లకు పైగా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే, త‌ల‌స‌రి అనాథ కేసుల లెక్కలు అత్యధికంగా పెరూ, దక్షిణాఫ్రికాలో ఉన్నాయనీ, ప్రతి 1000 మంది పిల్లలలో వరుసగా 8, 7 మంది ప్రభావితమవుతున్నార‌ని తెలిపారు. అన్ని దేశాల్లోనూ తల్లిని కోల్పోయిన వారి కంటే మూడు రెట్లు ఎక్కువ మంది పిల్లలు తండ్రిని కోల్పోయార‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. అన్ని దేశాలలో చిన్న పిల్లల కంటే అనాథలలో కౌమారదశలో ఉన్నవారు చాలా ఎక్కువగా ఉన్నారు. COVID-19 మహమ్మారి కారణంగా మరణించినట్లు నివేదించబడిన ప్రతి వ్యక్తిలో, ఒక పిల్లవాడు అనాథగా మిగిలిపోతాడు లేదా సంరక్షకుడిని కోల్పోతాడని మేము అంచనా వేస్తున్నామ‌ని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో అధ్యయనంలో పనిచేసిన అధ్యయన ప్రధాన రచయిత సుసాన్ హిల్లిస్ చెప్పారు. ఈ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డానికి ప్రభుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 432,176,247 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 5,949,044 క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, జ‌ర్మ‌నీ, ట‌ర్కీ, ఇట‌లీ, స్పెయిన్ లు టాప్‌-10 లో ఉన్నాయి.