బృహ‌త్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ  తీసుకున్న ఓ నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఒక అపార్ట్‌మెంటులో ఒక్క కుక్క మాత్రమే ఉండాలని, వ్యక్తిగత నివాసాల్లో ఉండేవారి వద్ద మూడు కుక్కలకు మించకూడదని బెంగళూరు నగరపాలక సంస్థ  తాజాగా  ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు వీటికి లైసెన్సులు కూడా తీసుకోవాలని సోమవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. 

ఈ నిర్ణయంతో యజమానులు తమ పెంపుడు జంతువుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కుక్కలను వదులుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. తాజా నిబంధనల ప్రకారం కుక్కలకు లైసెన్సులు తప్పనిసరి చేశారు. రేడియో కాలర్ ఉన్న చిప్‌ను లైసెన్స్‌లో పొందుపరుస్తారు. దీనికి అయ్యే ఖర్చులను సైతం యజమానే భరించాలి. ఒకవేళ లైసెన్స్ లేని పక్షంలో రూ.1,000 జరిమానా చెల్లించాలి. 

కాగా..ఈ నిబంధనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ నిబంధనను వెంటనే తొలగించాలని కోరుతూ..  సోషల్ మీడియాలో ఉద్యమం కూడా చేపట్టారు. not with out my dog కి హ్యాష్ ట్యాగ్ జతచేసి ట్విట్టర్ లో జంతు ప్రేమికులు పోస్టులు పెడుతున్నారు.