ఏఐఏడీఎంకేను కాపాడుకుంటూ అన్నమలైను అదుపులో పెట్టడానికి ఒక కొత్త పదవి సృష్టించి ఆ బాధ్యతలు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగించాలా? లేక ఆమెనే తాత్కాలికంగా అధ్యక్షురాలిగా నియమించాలా? అని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తుంది. ఈ తరుణంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది.
చెన్నై: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులోనూ బీజేపీ వ్యవస్థాగత మార్పులకు సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ మార్పులు పూర్తి చేసింది. అయితే, దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ తమిళనాడులోనూ తమ బలాన్ని పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు తమిళనాడు బీజేపీకి సంబంధించి ఏదైనా కీలక బాధ్యత అప్పగించాలని, అన్నమలైను కొంచెమైన నియంత్రణలో పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. తమిళనాడులో బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా అన్నమలై ఉన్నారు. యంగ్ లీడర్ అయిన అన్నమలై అధికార పార్టీపై సింగిల్‌గా ఎక్కువ పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని వణికించే ఆరోపణలూ చేస్తున్నారు. ఇటీవలే అవినీతి ఆరోపణలతో తీవ్రంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా ఎదుగుతున్నది. కానీ, తమిళనాడులో పరిస్థితులు వేరు. అక్కడ ద్రవిడ పార్టీలకు తప్పితే మరే పార్టీకి పెద్దగా స్కోప్ ఉండదు. బీజేపీ కూడా అక్కడ ఏఐఏడీఎంకేతో పొత్తులో ఉంటుంది. కానీ, మిత్రపక్షమైన ఏఐఏడీఎంకేనూ అన్నమలై ఖాతరు చేయడం లేదు. ఇది ఏఐఏడీఎంకేకు మింగుడుపడటం లేదు. అన్నమలై పై పలు ఫిర్యాదులనూ బీజేపీ అధిష్టానానికి అందజేశారు. ఏఐఏడీఎంకే ఆందోళనలను ఒకవైపు దృష్టిలో పెట్టుకోవడమే కాదు.. ఆ పార్టీతో చెడితే బీజేపీ బలం మరింత దెబ్బతినే అపాయం లేకపోలేదు. అందుకే అధిష్టానం డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
అటు కూటమిలోని ఏఐఏడీఎంకేను కాపాడుకుంటూ.. పార్టీలో కొంత ఊపు తీసుకువచ్చిన అన్నమలైను ఇబ్బంది పెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. అన్నమలైది ఒంటెద్దు పోకడ. కూటమి పార్టీని కలుపుకోడు. కూటమిలో బీజేపీ చిన్నపార్టీనే కానీ, పెద్దపార్టీ అయిన ఏఐఏడీఎంకేను లెక్క చేయడు. వస్తే మాతో రండి, లేదంటే మేమే చూసుకుంటాం అనే ధోరణిలో అన్నమలై ఉన్నారు. ఇది ఏఐఏడీఎంకే నచ్చడం లేదు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో సరైన నిర్ణయం, మార్పులు, చేర్పులు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అన్నమలైకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఉదయమే ఢిల్లీ వెళ్లిన అన్నమలై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అన్నమలై సమావేశమైనట్టు తెలిసింది. కొంత దూకుడు తగ్గించాలని, ఏఐఏడీఎంకేతో కొంత సఖ్యంగా మెలగాలని అన్నమలైకు వారు సూచించినట్టు సమాచారం.
Also Read: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే ?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నమలైను తప్పిస్తారా? అనే చర్చ జోరందుకున్నది. తెలంగాణలో అధ్యక్షుడిని తప్పించినందుకు పార్టీ వర్గాల నుంచే అధిష్టానం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఓ కీలక ఆలోచన చేసినట్టు తెలిసింది. తమిళనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అన్నమలై కొనసాగిస్తూనే ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన విషయాలను పర్యవేక్షించే బాధ్యతలను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగిస్తున్నట్టు సమాచారం. దీంతో ఏఐఏడీఎంకేను కాపాడుకుంటూ అన్నమలై దూకుడుకూ కొంత నియంత్రణ కల్పించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.
సీతారామన్ తమిళం అనర్గళంగా మాట్లాడగలరు. రాష్ట్ర వ్యవహారాలపై మంచి పట్టు ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆమెను అన్నమలైను సూపర్‌వైజ్ చేసే ఓ పదవి సృష్టించి ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించాలా? లేక ఎన్నికలవరకైనా తాత్కాలిక అధ్యక్షురాలిగా నిర్మల సీతారామన్‌ను ఎంచుకోవాలా? అనే ఆలోచనలు బీజేపీ చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా కర్ణాటకకు చెందిన రవి, కో ఇంచార్జీగా తెలంగాణకు చెందిన సుధాకర్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ బాధ్యతలు అప్పగించింది.
