రాహుల్ గాంధీని అవమానించడానికే ప్రభుత్వం ఆయనకు కల్పించిన బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు పంపించారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది సరైన పద్దతి కాదని చెప్పారు.
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసిన ఒక రోజు తరువాత ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని అవమానించడాకే బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశాలు పంపారని అన్నారు. ఒక వేళ ఆయన బంగ్లా ఖాళీ చేస్తే తన తల్లితో కలిసి నివసించవచ్చని, లేకపోతే తన నివాసంలోకి రావచ్చని తెలిపారు.
బంగ్లా ఖాళీ విషయంలో లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాహుల్ గాంధీ లేఖ.. ఏమన్నారంటే..
‘‘రాహుల్ గాంధీని బెదిరించి అవమానించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను (రాహుల్ గాంధీ) బలహీనపర్చడానికి వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆయన బంగ్లాను ఖాళీ చేస్తే తన తల్లితో కలిసి నివసిస్తారు. లేకపోతే అతను నా వద్దకు రావచ్చు. నేను ఒక దానిని ఖాళీ చేస్తాను. ఆయనను భయపెట్టడం, బెదిరించడం, అవమానించడం వంటి ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఇది పద్ధతి కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘మాకు కొన్ని సార్లు మూడు నాలుగు నెలలు బంగ్లా లేకుండా ఉన్నాం. ఆరు నెలల తర్వాత నాకు బంగ్లా వచ్చింది. ఇతరులను అవమానించడానికి వారు అలా చేస్తారు. ఇలాంటి వైఖరిని ఖండిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
కాగా.. రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ చేయాలని పంపించిన నోటీసులపై లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ లో మెంబర్ గా ఉన్న కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని ప్రయోజనాలు పొందుతున్న కొన్ని కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడటం వల్ల ఆయనకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించి సీఆర్ పీఎఫ్ భద్రత కల్పించారని అన్నారు. ఫిబ్రవరి 7న అదానీ -మోడీ స్నేహం విషయం మాట్లాడినప్పుడు ఆయన ఎంపీ పదవికి అనర్హులయ్యారని ఠాగూర్ ఆరోపించారు.
అలాగే మార్చి 25వ తేదీన మోడీ- అదానీ గురించి మాట్లాడటంతో ఇప్పుడు మార్చి 27న ఇంటిని కూడా తీసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ‘‘వాహ్ నరేందర్ బాబా. ఇప్పుడు అతని నుంచి ఇంకేం తీసుకోగలరు? రాహుల్ గాంధీ నిజం మాట్లాడుతున్నారు. అదానీకి బహూకరిస్తున్న సంపదకు వ్యతిరేకంగా భారత్ కోసం పోరాడుతున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.
దేశంలోని ఏ వ్యక్తీ చట్టానికి అతీతులు కాదు - రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్మృతి ఇరానీ కామెంట్స్..
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్షను నెల రోజుల పాటు సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఆయన దోషిగా తేలిన నాటి నుంచే లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాహుల్ గాంధీ నివసిస్తున్న తుగ్లక్ లేన్ బంగ్లా - 12ను ఏప్రిల్ 22లోగా ఖాళీ చేయాలని ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆయన ఆ నివాసంలో 2005 నుంచి జెడ్ ప్లస్ భద్రతతో నివసిస్తున్నారు.
