న్యూఢిల్లీ:  సస్పెన్షన్ కు గురైన రాజ్యసభ ఎంపీలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలోనే  నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు కూడ రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేకపోతే ఈ సమావేశాలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఇతర పార్టీలకు చెందిన సభ్యులు కూడ ఈ సభ్యలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.

పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్ సింగ్  స్వయంగా టీ అందించారు. అయితే ఈ టీ ఆఫర్ ను సస్పెన్షన్ కు గురైన ఎంపీలు తిరస్కరించారు. 

తనను దూషించిన వారికి డిప్యూటీ ఛైర్మెన్ టీ అందించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు.విపక్ష సభ్యుల తీరుకు నిరసనగా తాను ఇవాళ ఉపవాసం చేస్తానని డిప్యూటీ ఛైర్మెన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు.

మంగళవారం నాడు సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సహా ఇతర విపక్షాలు కూడ ఈ డిమాండ్ ను సమర్ధించాయి. విపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సభ నుండి వాకౌట్ చేసింది.

వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని డిప్యూటీ ఛైర్మెన్ 13 సార్లు కూర్చోవాలని కోరినట్టుగా రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యసభ ఛైర్మెన్ చైర్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని ఆయన చెప్పారు. 

ప్రతిపక్ష సభ్యులు మార్షల్స్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.