జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై ప్రతిపక్ష నేతలు సమావేశం అయ్యారు. అనంతరం, వారు ఎన్నికల సంఘానికి మెమోరాండం అందించి కశ్మీర్‌లో వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అది కశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు.
శ్రీనగర్: ప్రతిపక్ష నేతలు, జమ్ము కశ్మీర్ ప్రాంతీయ పార్టీల నేతలు గురువారం సమావేశమయ్యారు. జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, భావి కార్యచరణపై చర్చించారు. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని, కశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వారంతా కలిసి ఒక మెమోరాండాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని అందులో ఈసీని కోరారు.
ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీపీఐ, ఆర్జేడీ పార్టీల నేతలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, వారు ఎన్నికల సంఘానికి మెమోరాండం అందించారు.
ఈ మెమోరాండంలో ప్రతిపక్ష నేతలు కీలక విషయాలను ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్‌లో గత ఐదేళ్లుగా అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకోకుండా, ఎన్నికల ప్రభుత్వం లేకుండానే పాలన సాగుతున్నదని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజా ప్రాతినిధ్యం లేకుండా, జవాబుదారీతనం లేని బ్యూరోక్రసీతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ఇది సాధారణ ప్రజానీకానికి అనుకూలంగా లేదని తెలిపారు.

పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ రాజ్ వ్యవస్థల ఎన్నికలు శాసనసభ ఎన్నికలను భర్తీ చేయలేవని, కాబట్టి, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ ఇంకెంత మాత్రం జాగు చేయరాదని తెలిపారు. అది విషయం కాదనుకుంటే.. త్రిపుర, మేఘాలయా, నాగాల్యాండ్ ఎన్నికల నిర్వహణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలనూ గడువులోపూ నిర్వహించాల్సిన అవసరం లేకుండా ఉండేదని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్నికలు నిర్వహిచాం కాబట్టి, ఆ వ్యవస్థలే పాలిస్తాయని, అసెంబ్లీ అవసరం లేదనే వాదనలు చేస్తున్నారని, ఇదెంత మాత్రం హేతుబద్ధ వాదని కాదని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు.
Also Read: భారత ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నేను పార్లమెంట్‌లో మాట్లాడగలను: బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..
కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర ప్రభుత్వ నేతలు ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని పలుమార్లు ప్రకటించారని, తుది నిర్ణయం ఈసీ నుంచి వెలువడాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధ బాధ్యత ఈసీపై ఉన్నదని, ఈ ఎన్నికలను వ్యతిరేకించడమంటే కశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే కాదు.. రాజ్యాంగబద్ధ బాధ్యతనూ ఉల్లంఘించినట్టేనని వాదించారు.
జమ్ము కశ్మీర్ సహా దేశంలోని రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఈ మెమోరాండంపై సంతకం పెడుతున్నారని, తామంతా జమ్ము కశ్మీర్‌లో జాప్యం చేయకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామని తెలిపారు. ఇది జమ్ము కశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు.
