మణిపూర్‌పై ఆగని రగడ.. పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా విపక్ష పార్టీల ఎంపీల నిరసన..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. పార్లమెంట్ ఉభయసభల్లో మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టగా.. మూడో రోజు (జూలై 24) కూడా వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. పార్లమెంట్ ఉభయసభల్లో మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టగా.. మూడో రోజు (జూలై 24) కూడా వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీల బృందం పార్లమెంట్ హౌస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు కూర్చొని ఆందోళనకు దిగింది. ‘‘ఇండియా ఫర్ మణిపూర్’’ ప్లకార్డులు పట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మౌన నిరసన చేపట్టారు. వారు రాత్రి అక్కడే బస చేశారు. మణిపూర్‌లో రెండు నెలలుగా జరుగుతున్న జాతి హింసపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని I.N.D.I.A కూటమి డిమాండ్ చేసింది.
మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన ఇవ్వాలని ప్రతిపక్ష కూటమి కోరుతున్నప్పటికీ.. ఆ డిమాండ్‌ను ప్రభుత్వం నిరాకరించడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా ఎలాంటి చర్చ జరగకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం పేర్కొంది. పార్లమెంటులో మణిపూర్ హింసాకాండ సమస్యను ప్రస్తావించాలని కోరినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వర్షాకాల సమావేశాల మిగిలిన సెషన్‌కు సస్పెండ్ చేయబడ్డారని.. ఆయనకు సంఘీభావంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే అన్నారు.
ఇక, మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు పలువురు ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఎలాంటి సమయ పరిమితులు లేకుండా అన్ని పార్టీలు మాట్లాడేందుకు వీలుగా చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ నెల 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు నిరసన చేపడుతున్నాయి.
అయితే మణిపూర్ అంశంపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని కేంద్రం ప్రభుత్వం ఆరోపించింది. ఆ అంశంపై పట్ల వారి తీవ్రతను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షం కూడా కేంద్ర ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతుందని ఆరోపించింది. ‘‘ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలన్నదే మా డిమాండ్. ఆ ప్రకటనపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మీరు బయట మాట్లాడుతున్నారు కానీ లోపల మాట్లాడటం లేదు. ఇది పార్లమెంటును అవమానించడమే. ఇది తీవ్రమైన విషయం’’ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.