బెంగుళూరులో ప్రారంభమైన విపక్షాల సమావేశం: సీఎంపీపై సబ్ కమిటీ సహా పలు అంశాలపై చర్చ
బెంగుళూరులో విపక్ష పార్టీల సమావేశం సోమవారంనాడు రాత్రి ప్రారంభమైంది. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యారు.

బెంగుళూరు: విపక్ష పార్టీల సమావేశం సోమవారంనాడు రాత్రి బెంగుళూరులోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి 26 పార్టీల నుండి 53 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు 2024 ఎన్నికల్లో ఎంపీ సీట్ల కేటాయింపు, ఉమ్మడి ఐక్య కార్యాచరణ విషయమై చర్చించనున్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సభల నిర్వహణపై చర్చిస్తారు.
ఈ సమావేశానికి హాజరైన విపక్ష పార్టీల నేతలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య విందు ఇవ్వనున్నారు. పాట్నాలో జరిగిన గత సమావేశానికి కొనసాగింపుగా బెంగుళూరు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం నిర్వహణ కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ కూటమికి ఏ పేరు పెట్టాలనే దానిపై కూడ చర్చించనున్నారు.
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించాలనే లక్ష్యంతో ఈ కూటమి సమావేశం సాగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం విపక్ష పార్టీల్లో జోష్ ను నింపింది. విపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది. రేపటి వరకు ఈ సమావేశం జరగనుంది.
also read:విపక్ష పార్టీల భేటీ: బెంగుళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్
ఇదిలా ఉంటే రేపు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించనున్నారు.