విపక్ష పార్టీల భేటీ: బెంగుళూరుకు చేరుకున్న సోనియా, రాహుల్
విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇవాళ బెంగుళూరుకు చేరుకున్నారు.

బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు సోమవారంనాడు మధ్యాహ్నం బెంగుళూరుకు చేరుకున్నారు. బెంగుళూరుకు చేరుకున్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. సోనియా గాంధీకి , రాహుల్ గాంధీలకు ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు
. విపక్ష పార్టీల సమావేశం రెండు రోజుల పాటు బెంగుళూరులో జరగనుంది. ఇవాళ సాయంత్రం, రేపు ఈ సమావేశం జరగనుంది. గతంలో పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరగనుంది. ఇవాళ జరిగే సమావేశానికి 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రసంగంతో విపక్ష పార్టీల సమావేశం ప్రారంభం కానుంది
విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్సీపీలో పరిణామాలు, రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ నెల 20 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రానున్న రోజుల్లో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు విపక్ష పార్టీలు ఏకమైనట్టుగా కేసీ వేణుగోపాల్ చెప్పారు.
ఈవీఎం మిషన్లు, ఎంపీ సీట్ల పంపకం, విపక్ష పార్టీల కూటమికి ఏ పేరు పెట్టాలనే దానిపై ఇవాళ సమావేశంలో చర్చించనున్నారు.2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టేందుకు విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నాయి.ఈ మేరకు ఉమ్మడి ఐక్యకార్యాచరణను సిద్దం చేయనున్నాయి.